YS Jagan 2.0 political strategies
YS Jagan Mohan Reddy : బాధపడితే కానీ బోధపడదంటారు. చేసిన తప్పులు ఓటమితోనే తెలుస్తాయి. ఎక్కడ ఏ లోపం జరిగిందో అప్పుడే తెలుసుకోగలం. ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) ఇదే మాదిరిగా తప్పులు తెలుసుకుంటున్నారు. తప్పులు సరిదిద్దుకుంటానని చెబుతున్నారు. ఇకనుంచి తనలో కొత్త కోణాన్ని చూస్తారని పార్టీ శ్రేణులకు చెప్పుకొస్తున్నారు. జగన్ 1.0 ప్రజల కోసమని.. జగన్ 2.0 కార్యకర్తల కోసమని బాహటంగానే ప్రకటించారు. పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్న తరుణంలో.. చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఆందోళనతో ఉన్నారు. కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్ లో చాలామంది కార్పొరేటర్లు పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో వారిని పిలిపించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వారి సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి తాను మారుతానని.. తన వ్యూహాలు మారుతాయని చెప్పుకొచ్చారు.
* సైనికుల మాదిరిగా కృషి
2019లో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). ఆ ఎన్నికల్లో సీఎంగా జగన్ ను చూడాలని సగటు వైసీపీ అభిమాని ఆశించారు. సైనికుడి మాదిరిగా పనిచేశారు. వారు అనుకున్న దానికంటే ఘనవిజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో తమకు మంచి రోజులు వచ్చాయని ఎంతగానో ఆనందపడ్డారు. ఇక మా జీవితాలు బాగుపడతాయని కూడా ఆశపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను పెట్టారు. పంచాయితీలను నిర్వీర్యం చేశారన్న విమర్శను ఎదుర్కొన్నారు. దీంతో వైసీపీకి మద్దతు పలికిన చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులు నీరుగారి పోయారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తమ పాత్ర లేకపోయేసరికి ప్రజల్లో చులకన అయ్యారు.
* వాలంటీర్లతో నేతలకు చెక్
సంక్షేమ పథకాలతో( welfare schemes) పాటు పౌర సేవలు అందించేందుకు వీలుగా వాలంటీర్లను నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఈ తరుణంలో గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. వలంటీర్ కు చెబితే చాలు అన్ని పనులు అయిపోతాయి అన్న భావన ప్రజల్లో వచ్చింది. ఇచ్చేది వైసిపి ప్రభుత్వం అయితే.. లబ్ధిదారులు మాత్రం వలంటీర్లు ఇస్తున్నట్లు భావించారు. కేవలం వాలంటీర్లతోనే పాలన నడుస్తుందని.. గ్రామస్థాయి నేతలతో అస్సలు పనిలేదు అన్నట్టు వ్యవహరించేవారు ప్రజలు. మరోవైపు గత ఐదేళ్లుగా పార్టీ శ్రేణులకు లాభం చేకూర్చే ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. కొంతమంది సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి భవనాల నిర్మాణం చేపట్టి ఆర్థికంగా కూడా నష్టపోయారు. సకాలంలో వారికి బిల్లులు కూడా చెల్లించలేదు. అందుకే కార్యకర్తలు నేతల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. 2019 ఎన్నికలు మాదిరిగా అంకితంతో పనిచేయలేకపోయారు. ఈ పరిస్థితులను గమనించి జగన్మోహన్ రెడ్డి తాజాగా కార్యకర్తల కోసం పూర్తిగా దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు.
* ఏ పార్టీకైనా క్యాడర్ ముఖ్యం
ఏ రాజకీయ పార్టీ కైనా క్యాడర్ ( cader )ముఖ్యం. క్యాడర్ ప్రయోజనాలు ముఖ్యం. ప్రజలను పోలింగ్ బూతులకు తీసుకొచ్చి ఓటు వేసేది వారే. కానీ వాలంటీర్లతో ఆ తతంగం నడిపిస్తానని జగన్ ఒక అంచనా వేసుకున్నారు. కానీ ఆ అంచనా తప్పింది. అందుకే ఇప్పుడు తనను తాను మార్చుకునే పనిలో పడ్డారు. నేను మారాను. నా వ్యూహాలు మారుతాయి. అంటూ క్యాడర్కు చెబుతున్నారు. 2029 ఎన్నికల్లో విజయం ఖాయమని.. కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని హామీ ఇస్తున్నారు. అయితే తప్పకుండా జగన్ లో చూస్తే మాత్రం పరివర్తన కనిపిస్తోంది. మరి ఆయన మాటలను క్యాడర్ విశ్వసిస్తుందో.. విస్మరిస్తుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: What are ysrcp chief jagans 2 0 political strategies going to be
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com