Heat Waves: ఏపీ ప్రజలకు హాట్ వార్త. ఈ ఏడాది వేసవిలో ఎండలు దుమ్మురేపనున్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ నెల నుంచి మే వరకు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది కాలంగా వర్షాభావ పరిస్థితులు కారణంగా ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేసవిలో ఎండలు మండడానికి కూడా అదే కారణం.
ప్రధానంగా కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలను అలెర్ట్ చేసింది. ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందని.. అందుకే నిరంతరం అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారుల్లో కూడా ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఒకవైపు ఎన్నికల విధులు, మరోవైపు వేసవి హెచ్చరికలతో యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
వేసవి దృష్ట్యా ప్రజలు కూడా స్వీయ రక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓఆర్ఎస్, మజ్జిగ, మంచినీరు తీసుకుంటే చాలా మంచిది. కాగా ఎండలు, వడగాల్పులు, పిడుగుల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లను సైతం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. 112, 1070, 18004250101 నంబర్లకు సంప్రదిస్తే సత్వర సహకారం అందించే అవకాశం ఉంది.