Egg prices fall in AP: ఏపీలో( Andhra Pradesh) కోడిగుడ్ల ధరలు పతనం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు ఒక్కో కోడిగుడ్డు ఎనిమిది రూపాయల వరకు విక్రయించారు. కానీ ఇప్పుడు మూడు రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఉంది. ఇక్కడి నుంచి ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రధానంగా ఇరాన్ సమీపంలోని హార్మోజ్ జల సంధి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. దుబాయ్ తో పాటు కతర్ లో ఉన్న పోర్టు ద్వారా యూరప్ దేశాలకు ఆహార పదార్థాలు ఎగుమతి అవుతుంటాయి. గల్ఫ్ దేశాలకు సైతం మన రాష్ట్రం నుంచి ఎక్కువగా కోడిగుడ్లు ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడే ఈ ఆహార ఉత్పత్తులకు సంబంధించిన కంటైనర్లు నిలిచిపోవడంతో నష్టం జరుగుతోంది. ఏపీలో గుడ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా గుడ్ల ధరకు తగ్గుముఖం పట్టింది.
ఏపీ ప్రసిద్ధి..
ఆంధ్ర ప్రదేశ్ ను ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా( egg bowl of India), ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా గా పిలుస్తారు. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమల ఉత్పత్తిలో ఏపీ స్థానం 18%. రోజుకు దాదాపు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రధానంగా విశాఖ, విజయవాడ, చిత్తూరు కేంద్రంగా విస్తరించి ఉంది ఏపీ పౌల్ట్రీ పరిశ్రమ. అంతర్జాతీయంగా కూడా మార్కెట్ ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఇక్కడ నుంచి కోడిగుడ్లు ఎగుమతి అవుతుంటాయి.
పేరుకుపోయిన నిల్వలు..
ఇరాన్ ( Iran)సమీపంలోని హార్మోజ్ రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో మన రాష్ట్రంలో కోడిగుడ్లు నిల్వలు పేరుకుపోయాయి. దేశీయ మార్కెట్లో కోడిగుడ్ల ధర బాగా పడిపోయింది. ఎగుమతి చేయాల్సిన గుడ్లను నిల్వ చేయడం కూడా వీలుకాని పరిస్థితి. దీంతో వ్యాపారులు ధర తగ్గించి అమ్ముతున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అయితే 100 గుడ్ల ధరను 420గా నిర్ణయించింది. అయితే కోడిగుడ్ల నిల్వలు పెరిగిపోవడంతో వ్యాపారులకు నష్టం తప్పడం లేదు. అందుకే ఒక్కోడి గుడ్డును మూడు రూపాయల లెక్కన విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు మార్కెట్ బాగానే ఉండేది. కానీ యుద్ధం పుణ్యమా అని ఇప్పుడు ధర పతనం కావడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు.