Smuggling Like Puspha Movie: పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర గుర్తుంది కదూ. పాలు మాటున గంధపు చెక్కలు స్మగ్లింగు ఏ తరహాలో చేస్తాడో భలే ఆసక్తిగా ఉంటుంది. అచ్చం అదే తరహాలో గంజాయి లిక్విడ్ రవాణా చేసి నిర్దేశించిన లక్ష్యానికి చేరువలో పోలీసులకు పట్టుబడ్డారు ఇద్దరు యువకులు..విశాఖ మన్యం నుంచి గంజాయి లిక్విడ్ హాష్ ఆయిల్ ను భాగ్యనగరానికి తరలించారు. నిర్ధేశించిన చోటుకు చేర్చే సమయానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరూ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. అయితే వీరు కేవలం థర్డ్ పార్టీ మాత్రమే. గంజాయి లిక్విడ్ ఇచ్చింది ఒకరు… వారు నిర్దేశించిన చోటుకు చేర్చడమే వీరి పని. మిగతా విషయాలను ఏమీ తెలియనివ్వరు. అంతలా విస్తరించింది గంజాయి మాఫియా. విశాఖ నుంచి దేశ నలుమూలకు ఇదే విధంగా గంజాయి సప్లయ్ అవుతోంది. ఎంతో మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు సమిధులుగా మారుతున్నారు. ఇటీవల నిఘా ఎక్కువ కావడంతో గంజాయి అక్రమ రవాణాదారులు రూటుమార్చారు. రోడ్డు, రైలు మార్గంలో రవాణా చేస్తున్న సమయంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. అందుకే గంజాయిని లిక్విడ్ రూపంలో మార్చి తరలించే కొత్త ఎత్తుగడను తెరలేపారు. హాష్ ఆయిల్ రూపంలో మార్చి వాటిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా ఏపీలోని విశాఖ మన్యం ప్రాంతం నుంచి ఉత్తరాధి రాష్ట్రాలకు గంజాయి తరలుతోంది. మన్యంలోని అరకు, పాడేరు, ముంచంగిపుట్టు తదితర అటవీ ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి సాగుచేస్తున్నారు. అయితే కొందరు ముఠాగా ఏర్పడి గంజాయిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల తనిఖీలు ఎక్కువ కావడంతో కొందరు అక్రమార్కులు తమ చేతికి మట్టి అంటకుండా నిరుద్యోగ యువతను, విద్యార్థులను పావుగా వాడుకుంటున్నారు.

వారే టార్గెట్…
విశాఖ జిల్లా జంపెన గ్రామానికి చెందిన కోన శివ డిగ్రీ చదువుతున్నాడు. అతడికి నూకరాజు అనే స్నేహితుడు ఉన్నాడు. నిరుపేద కుటుంబాలు కావడంతో ఆర్థిక ఇబ్బందులున్నాయి. అయితే ఈ విషయం గంజాయి అక్రమ తయారీదారులకు తెలిసింది. వారి అవసరాలను ఆసరాగా చేసుకొని గంజాయి అక్రమ రవాణాకు వారిని ఒప్పించారు. అసలు అది గంజాయే కాదని.. లిక్విడ్ రూపంలో ఉంది కనుక ఎవరూ పసిగట్టలేరని నమ్మబలికారు. గ్రీజు డబ్బాలో నాలుగు లీటర్ల హాష్ ఆయిల్ ను నింపారు. దానిని గిఫ్ట్ ప్యాక్ గా తయారుచేసి శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన సంతోష్ అనే యువకుడు వీరి చేతిలో పెట్టడు. వీరి సంజీవరావు అనే వ్యక్తి సహాయాన్ని తీసుకున్నారు. గిఫ్ట్ ప్యాక్ ను ఆయనతో హైదరాబాద్ తరలించారు. ముగ్గురు వేర్వేరుగా హైదరాబాద్ లో అడుగు పెట్టారు. అప్పటికే శివ, నూకరాజులు గంజాయి లిక్విడ్ లతో హైదరాబాద్ వస్తున్నారని స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో వారు ముగ్గుర్నీ వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు లీటర్ల గంజాయి లిక్విడ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.4 లక్షల పైమాటే.
పెద్ద ముఠాగా..
అయితే పోలీసులకు పట్టుబడిన ముగ్గురు యువకులు తమకు సంతోష్ కుమార్ అనే వ్యక్తి 20 వేల రూపాయలకు మాట్లాడుకున్నాడని.. లిక్విడ్ ను హైదరాబాద్ తేవడమే తమ పని అని.. వారు ఎవరకు అప్పగించమంటే వారికి అప్పగించడంతో తమ పని అయిపోతుందని ముగ్గురు యువకులు చెబుతున్నారు.పుష్ప సినిమా తరహాలో ఎపిసోడ్ నడవడంతో దీని వెనుక ఉన్న సూత్రధారులెవరు అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు విశాఖ సరిహద్దులో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు ఆంధ్రా, అటు చత్తీస్ గడ్ కు మధ్య పూర్తిగా దండకారణ్యం ఉంది. అక్కడ గంజాయి సాగు అధికంగా చేస్తున్నారు. ఉత్తరాధి రాష్ట్రాలకు సైతం ఇక్కడ నుంచే సప్లయ్ జరుగుతోంది. పర్యాటకం మాటున కొంతమంది వచ్చి గంజాయిని తరలిస్తున్నారు. అటు విశాఖ నగరంలో కూడా గంజాయి వినియోగం అధికమైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే గంజాయి నియంత్రణపై విశాఖ పోలీసులు ప్రణాళికరూపొందించారు.
[…] […]