Vundavalli Aruna Kumar: ఎవరు గెలుస్తారో సూటిగా చెప్పలేకపోతున్న ఉండవెల్లి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండుసార్లు రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన ఉండవల్లి గెలుపొందారు. మంచి వాగ్దాటి, రాజకీయాలపై సమగ్ర అవగాహన ఉండడంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందగలిగారు.

Written By: Dharma, Updated On : February 3, 2024 4:48 pm
Follow us on

Vundavalli Aruna Kumar: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ రాజకీయవేత్త. సమకాలీన రాజకీయ అంశాలపై సునిశిత విశ్లేషణ చేయగలరు. రాజకీయ పరిణామాలను అంచనా వేయగలరు. ఇటీవల ఆయన తరచూ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపు పొందుతుంది అనే దానిపై రకరకాల విశ్లేషణ చేస్తున్నారు. కానీ దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో? సూటిగా చెప్పడం లేదు. పార్టీల వైఫల్యాలు, కలిసి వచ్చే అంశాలను మాత్రమే చెప్పగలుగుతున్నారు. దీంతో ఉండవల్లి మాటలు చాలామంది పరిగణలోకి తీసుకోవడం లేదు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండుసార్లు రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన ఉండవల్లి గెలుపొందారు. మంచి వాగ్దాటి, రాజకీయాలపై సమగ్ర అవగాహన ఉండడంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందగలిగారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. కానీ ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. న్యూట్రల్ గా ఉంటూ వస్తున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తరచూ విలేకరుల సమావేశం నిర్వహించి.. సమకాలీన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మీడియా ముందుకు వచ్చారు. జగన్ తో పాటు చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉండవెల్లి అరుణ్ కుమార్ మాటలు వైరల్ అవుతున్నాయి.

ఏపీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని ఉండవల్లి చెప్పుకొస్తున్నారు. పట్టణ ఓటర్లలో వైసిపి పై వ్యతిరేకత ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రోడ్లు, మౌలిక వసతులు, అభివృద్ధి లేకపోవడంతో పట్టణ ప్రజలు వైసీపీని వ్యతిరేకిస్తున్నారని తేల్చేశారు. అదే సమయంలో రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా ప్రజలు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారని.. వారంతా తిరిగి జగన్ కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని విశ్లేషించారు. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు నేరుగా నగదు బదిలీలు చేసిన ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడ లేదని వ్యాఖ్యానించారు. అయితే అంతటితో ఆగని ఉండవెల్లి చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. జగన్ కాకుండా ఏ పవన్ కళ్యాణో సీఎం అయి ఉంటే ప్రజలు నమ్మేవారని.. సంక్షేమ పథకాలకు చంద్రబాబు వ్యతిరేకం అనే చరిత్ర ప్రజలకు తెలుసని.. అందుకే ఆయన అధికారంలోకి వస్తే రద్దు చేస్తాడని ప్రజల్లో ఒక భావన ఉందన్నారు. తాను అధికారంలోకి వస్తే వైసిపి కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ చంద్రబాబు చెప్పడాన్ని జనం నమ్మడం లేదని కూడా తేల్చేశారు. ఉచితల వల్ల ఏపీ దివాలా తీసింది అని చెప్పిన చంద్రబాబే.. అంతకంటే ఎక్కువ డబ్బులు పంచుతామని చెప్పడం వల్ల నమ్మకం కోల్పోయారని ఉండవెల్లి స్పష్టం చేశారు.

అయితే ఉండవెల్లి అరుణ్ కుమార్ మాటలు చూస్తుంటే.. జగన్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. జగన్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్పు చేస్తుండడం కూడా తనకు అర్థం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎక్కడా ఎవరు గెలుస్తారు? అన్న విషయాన్ని మాత్రం ఉండవెల్లి చెప్పలేకపోతున్నారు. అయితే గత నాలుగున్నర సంవత్సరాలుగా ఉండవల్లిది ఇదే పరిస్థితి. మీడియా ముందుకు రావడం.. పొడిపొడిగా మాట్లాడడం… ఆ మాటల్లో కూడా జగన్ కు ఎంతో కొంత ఫేవర్ చేయడం అరుణ్ కుమార్ కు అలవాటైన విద్య అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 2014 నుంచి 2019 మధ్య నేరుగా రాష్ట్ర ప్రభుత్వంపై అరుణ్ కుమార్ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ గత ఐదేళ్లుగా ఈ పరిస్థితి లేకపోగా.. జగన్ కు అనుకూల వ్యాఖ్యలు చేసి తన మనసులో ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు అన్న అపవాదును మూటగట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలు సైతం ఉండవెల్లి ఏం చెప్పదలుచుకున్నారో.. సూటిగా చెప్పాలని కోరుతున్నారు.