Vizag Mp Family Kidnap : విశాఖలో కిడ్నాప్ కలకలం.. ఎంపీ కుటుంబమే టార్గెట్

దీంతో ఎంపీ కుమారుడు, భార్యతో పాటు ఆడిటర్ ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. కిడ్నాపర్లు సైతం చిక్కినట్టు సమాచారం. అయితే రౌడీషీటరే ప్రధాన నిందితుడు. ముఠాగా ఏర్పరుచుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : June 15, 2023 6:27 pm
Follow us on

Vizag Mp Family Kidnap : ప్రశాంత విశాఖపట్నంలో గొలుసు కిడ్నాప్ లు కలకలం రేపాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కిడ్నాపర్ల చేతికి చిక్కారు. వారంతా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బుధవారం వీరు కిడ్నాప్ నకు గురికాగా.. గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఇప్పటికే కిడ్నాప్ కథను విశాఖ పోలీసులు సుఖాంతం చేసినట్టు సమాచారం. మరికొద్ది గంటల్లో కిడ్నాప్ కేసుపై విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేయనున్నారు. నిందితుల పేర్లు వెల్లడించనున్నారు.

విశాఖలోని ఆనందపురంలోని గెస్ట్ హౌస్ లో ఎంపీ కుమారుడు శరత్ ఉన్నాడు. బుధవారం ఉదయం తొలుత ఎంపీ కుమారుడ్ని కిడ్నాపర్లు అపహరించారు. తాళ్లతో కట్టి ఏమీ జరగనట్టు ఫోన్ లో అందరితో మాట్లాడించారు. ఎంపీ భార్య జ్యోతికి ఫోన్ చేయించి డబ్బులు డిమాండ్ చేయించారు. నగదు తీసుకురాకపోతే కుమారుడ్ని చంపేస్తామంటూ బెదిరించారు.  లోకేషన్ షేర్ చేయించి అక్కడకు డబ్బులు తీసుకు రావాలని సూచించారు. అలా వెళ్లిన ఆమెను సైతం కిడ్నాప్ చేశారు.

ఎంపీతో సన్నిహితంగా ఉండేవారి వివరాలను సేకరించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఎంపీకి అత్యంత సన్నిహితుడు, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు టార్గెట్ చేశారు. ఎంపీ కుమారుడు, భార్య తమ అదుపులో ఉన్నారని.. నగదు తేకుంటే మట్టుబెడతామని హెచ్చరించారు. అయితే కిడ్నాపర్లు పగడ్బందీగా వ్యవహరించారు. అసలు కిడ్నాపే జరగలేదన్నట్టు బాధితులతో మాట్లాడించారు. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి ఆడిటర్ అందుబాటులోకి రాకపోవడం, కుటుంబసభ్యుల మాటలు ఆందోళనకరంగా ఉండడంతో అనుమానం వచ్చిన ఎంపీ గురువారం ఉదయం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని అలెర్టు చేశారు. దీంతో విశాఖ సీపీ విక్రం వర్మ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.

దర్యాప్తులో టెక్నాలజీని వాడిన పోలీసులు కిడ్నాపర్లు రుషికొండ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. ఆడిటర్ వెంకటేశ్వరరావు ఫోన్ లో అందుబాటులోకి రాగా ఆయనతో మాట్లాడారు. తాను శ్రీకాకుళం నుంచి వస్తున్నట్టు వెంకటేశ్వరరావు చెప్పారు. ఆయన భయంతో మాట్లాడుతున్నట్టు గుర్తించిన పోలీసులు కారులో వస్తున్నట్టు అంచనా వేశారు. దీంతో సీపీ నగరంతో పాటు పరిసర పోలీస్ స్టేషన్లను అలెర్టు చేశారు. దీంతో ఎంపీ కుమారుడు, భార్యతో పాటు ఆడిటర్ ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. కిడ్నాపర్లు సైతం చిక్కినట్టు సమాచారం. అయితే రౌడీషీటరే ప్రధాన నిందితుడు. ముఠాగా ఏర్పరుచుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. కొద్దిగంటల్లో విశాఖ నగర పోలీస్ కమిషనర్ కేసు వివరాలు వెల్లడించే అవకాశముంది.