Vivekananda Reddy : వివేకానంద రెడ్డి ( Vivekananda Reddy )హత్య కేసులో కీలక పరిణామం. ఈ కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ అప్రూవర్ గా మారుతానని సంకేతాలు ఇస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేయించారు? ఈ హత్యకు కుట్ర పన్నింది ఎవరు? అన్న విషయాలపై ఫుల్ క్లారిటీ ఇస్తానని సునీల్ యాదవ్ తేల్చి చెబుతున్నారు. ప్రాణహాని ఉందంటూ భయపడుతున్న ఆయన ఈరోజు కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ అప్రూవర్ గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లు అయింది.
* ఆరేళ్లుగా దర్యాప్తు కొనసాగుతూ..
2019 మార్చి 15న మాజీమంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గత ఆరేళ్లుగా సిబిఐ( Central Bureau of Investigation) దర్యాప్తు కొనసాగుతోంది. కానీ కేసు విషయంలో పురోగతి లేదు. ఇంతవరకు సిపిఐ చార్జి షీట్ దాఖలు చేయలేదు. కానీ ఈ ఆరేళ్ల కాలంలో ఆరుగురు కీలక సాక్షులు మరణించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి ఇప్పటికే అప్రూవర్ గా మారాడు. ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ ను కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరించడంతో ఆయన సైతం అప్రూవర్ గా మారేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. చంచల్ గూడా జైలులో తనను హతమార్చేందుకు ప్లాన్ చేశారని.. తనకు ప్రాణభయం ఉందని తాజాగా ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు పోలీస్ రక్షణ కల్పించాలని కోరుతున్నాడు.
* ఉన్నపలంగా సునీల్ యాదవ్..
అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఈ కేసులో ఏ 2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్( Sunil Yadav) బయటకు రావడం విశేషం. గత ఆరేళ్లుగా చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డానని.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని.. ఇప్పుడు చంపేస్తామని బెదిరిస్తున్నారని సునీల్ యాదవ్ చెబుతున్నాడు. వివేకా దారుణ హత్య వెనుక కుట్ర చేసింది ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తానని సునీల్ యాదవ్ ప్రకటించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సునీల్ యాదవ్ బయటకు వస్తున్న క్రమంలో ఈ కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతున్నాడు. ఇప్పుడు సునీల్ యాదవ్ సైతం అదే మాట చెబుతుండడంతో ప్రభుత్వం ఈ కేసు విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది.