YS Vivekananda Reddy Case
Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి ( Y S Vivekananda Reddy )హత్య కేసు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వీర విధేయుడు, వివేకానంద హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతోంది. ఇటీవలే ఆయన బెయిల్ పై బయటకు వచ్చాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాడు. 39 నెలలపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో తనను వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదని వాపోయాడు. పైగా ఇబ్బందులు పెడుతున్నారంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల కడప జిల్లా ఎస్పీని కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫిర్యాదు చేశాడు.
* తల్లితో కలిసి ఫిర్యాదు
ఈరోజు ఉదయం పులివెందుల ( pulivendula) పోలీస్ స్టేషన్లో తల్లితో కలిసి మరోసారి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వివేకా హత్యకు సంబంధించి ఇటీవల విడుదలైంది ‘హత్య’ అనే సినిమా. ఈ చిత్రంలో తనతో పాటు తన తల్లిని అనుమానించే విధంగా, క్రూరంగా సన్నివేశాలు చిత్రీకరించారని సునీల్ యాదవ్ చెబుతున్నాడు. సినిమా దర్శకుడు తో పాటు నిర్మాత, రచయితపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వారితో పాటు పులివెందులకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్చార్జిలపై సైతం ఫిర్యాదు చేశారు. వారిపై సైతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
* గ్రూప్ అడ్మిన్ పై ఫిర్యాదు
అయితే ప్రధానంగా వైఎస్ అవినాష్ అన్న యూత్( y s Avinash Anna youth ) పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో తనను, తన తల్లిని కించపరిచే విధంగా పోస్టులు, వీడియోలు, ఫోటోలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ ను మొదటి నిందితుడిగా చేర్చారు. అదే సమయంలో సునీల్ యాదవ్ సంచలన విషయాలను బయటపెట్టారు. పులివెందులలో నివాసం ఉంటున్న తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఇద్దరు కానిస్టేబుల్ లతో సునీల్ యాదవ్ కు రక్షణ కొనసాగుతోంది.