Visakhapatnam Railway Zone: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్( South coastal railway zone ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విభజన హామీల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించేందుకు పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో గత వైసిపి ప్రభుత్వం విఫలమయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై కదలిక వచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసింది కేంద్ర రైల్వే శాఖ. కొద్ది రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక రైల్వే జోన్ కు శంకుస్థాపన చేశారు. పూర్తిస్థాయి భవనాలు అందుబాటులోకి వచ్చేవరకు తాత్కాలిక భవనాల్లో ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. తీవ్ర తర్జనభర్జన నడుమ విశాఖలోని సిరిపురం జంక్షన్ లో.. విఎంఆర్డిఏ నిర్మించిన ది డెక్ భవనంలో జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ భవనంలో 6, 7 అంతస్తులను రైల్వే జోన్ కార్యాలయానికి కేటాయించారు. ఈ మేరకు విఎంఆర్డిఏ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం అందుబాటులోకి రానుంది.
Also Read: గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!
* విశాఖలో ‘ది డెక్’ భవనం
అత్యాధునిక హంగులతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ( railway department ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు పంపింది. అయితే అంతవరకు తాత్కాలిక భవనం కోసం రైల్వే శాఖ అన్వేషిస్తోంది. ఈ తరుణంలో ది డెక్ భవనం గురించి తెలిసింది. వి.ఎం.ఆర్.డి.ఏ అధికారుల నుంచి రైల్వే అధికారులు వివరాలు తీసుకొని ఢిల్లీలోని రైల్వే బోర్డు కు పంపించారు. స్థానిక ఎంపీ శ్రీ భరత్ విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ బోర్డు అధికారులు విశాఖ నుంచి వెళ్ళిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ విఎమ్ఆర్డిఏతో ఒప్పందం చేసుకోనుంది. ప్రతి చదరపు అడుగుకు 70 రూపాయల చొప్పున అద్దె చెల్లించేందుకు కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
* విభజన హామీల్లో భాగంగా..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన హామీల్లో భాగంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని అప్పట్లో కేంద్రం స్పష్టం చేసింది. 2014 ఎన్నికల్లో ఏపీలో టిడిపి( Telugu Desam Party ) అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో సైతం భాగస్వామ్యం అయింది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ అంశం తెరపైకి అప్పుడే వచ్చింది. సన్నాహాలు జరుగుతున్న సమయంలో వివిధ సాంకేతిక కారణాలు వెంటాడాయి. తరువాత రాజకీయ విభేదాలతో ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చింది. ఆ ప్రభావం రైల్వే జోన్ అంశంపై పడింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల కాలంలో రైల్వే జోన్ సాధించలేకపోయింది. అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో టిడిపి కూటమి విజయం సాధించింది. అయితే టిడిపి విన్నపం మేరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేలా తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావించింది. విఎంఆర్డిఏకు సిరిపురం జంక్షన్ లో ది డెక్ భవనం ఉంది. అక్కడ కార్యాలయం నిర్వహణకు అనువుగా ఉంటుందని అధికారులు గుర్తించారు. వి.ఎం.ఆర్.డి. ఏతో రైల్వే శాఖ ఒప్పందం తర్వాత ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
* అనేక డివిజన్లు విలీనం
కొద్దిరోజుల కిందటే విశాఖ రైల్వే జోన్ పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో కొనసాగిన రెండు డివిజన్లను దక్షిణ కోస్తా రైల్వే డివిజన్లో విలీనం చేసింది. అదే సమయంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని.. ఒక డివిజన్ ను విలీనం చేసింది. అయితే ఇప్పటివరకు కొనసాగిన వాల్తేరు డివిజన్ ను సైతం విశాఖ రైల్వే జోన్ లో చేర్చింది. అయితే ఇప్పుడు కార్యాలయ భవనం అందుబాటులోకి రావడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.