Visakhapatnam Railway Station: విశాఖ నగరం( Visakhapatnam City) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఐటీ హబ్ గా మార్చాలన్న ప్రయత్నంలో ఉంది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు సైతం విశాఖకు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వపరంగా ఆ సంస్థలకు భూ కేటాయింపులు జరుపుతోంది ఏపీ ప్రభుత్వం. పర్యాటక ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు నగరంలో మెట్రో ప్రాజెక్టు సైతం పట్టాలెక్కనుంది. ఇంకోవైపు విశాఖ రైల్వే స్టేషన్ ను మరింత ఆధునికరించాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద.. రాష్ట్రవ్యాప్తంగా 70 వరకు రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ ను సైతం ఎంపిక చేసింది.
Also Read:విశాఖ టు భోగాపురం.. నాలుగు టౌన్ షిప్ లు.. ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
14 ప్లాట్ ఫామ్ ల ఏర్పాటు ఉత్తరాంధ్రలోని( North Andhra) అతిపెద్దది విశాఖ రైల్వే స్టేషన్. ప్రస్తుతం ఎనిమిది ప్లాట్ ఫామ్ లతో ఉంది. దానిని 14 ప్లాట్ ఫామ్ లుగా విస్తరించనున్నారు. ప్రయాణికుల రద్దీ, రైళ్ల రాకపోకలను దృష్టిలో పెట్టుకొని విశాఖ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏపీలో 3 అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో ఒకటి విశాఖ. అయితే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే విశాఖ రైల్వే స్టేషన్ ను రూ.466 కోట్లతో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2027 నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే వచ్చే రెండేళ్లలో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జోరుగా సాగనున్నాయన్న మాట.
పెరిగిన ప్రయాణికుల రద్దీ..
ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి, ఒడిస్సా, చత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కువగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖ రైల్వే స్టేషన్ ను ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడున్న ఎనిమిది ప్లాట్ ఫామ్ లు ప్రయాణికులకు సరిపోవడం లేదు. అందుకే మరో రెండు ప్లాట్ ఫామ్ లు నిర్మించాలని భావించారు. అయితే ఆ సంఖ్యను నాలుగుకు పెంచారు. కానీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా ఆరు ప్లాట్ ఫామ్ లు నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో రైల్వే స్టేషన్ మరింత విస్తరించనుంది. ఇరువైపులా ఈ కొత్త ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వస్తాయి. రెండేళ్లలో వీటిని నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.
Also Read: విశాఖకు మరో మణిహారం.. ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు..
విశాఖ కేంద్రంగా కేంద్ర రైల్వే శాఖ దక్షిణ కోస్తా( South coastal ) రైల్వే జోన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శాశ్వత నిర్మాణాలు అందుబాటులోకి వచ్చేవరకు తాత్కాలిక భవనంలో రైల్వే జోన్ కార్యాలయాన్ని నిర్వహించాలని రైల్వే శాఖ భావిస్తోంది. మరోవైపు విశాఖ నుంచి ఉత్తరాంధ్ర అనుసంధానిస్తూ మెట్రో రైలు ప్రాజెక్టు సైతం అందుబాటులోకి రానుంది. దేశంలో ఎక్కువమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే తొలి 20 రైల్వే స్టేషన్లలో విశాఖ రైల్వే స్టేషన్ కూడా ఉంది. సాధారణ రోజుల్లో నిత్యం 50 వేల నుంచి 60 వేల మంది ప్రయాణికులు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యేక పండుగ దినాల్లో అయితే ఈ సంఖ్య 75 వేలకు దాటుతోంది. అందుకే ఈ స్టేషన్ ను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మరింత సౌకర్యాలు కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎయిర్ పోర్టు తరహాలో కొత్త ఎస్కలేటర్లు, ఎయిర్ కాన్ కోర్స్, వెయిటింగ్ ఏరియా వంటివి నిర్మించనున్నారు.