Visakha MP : కక్కలేక.. మింగలేకపోతున్న విశాఖ ఎంపీ.. ఇక వైసీపీకి దూరమే

తన వ్యాపారాలుపై మీడియా చేస్తున్న అతి వల్లే తాను వ్యాపారాలను హైదరాబాద్ కు షిఫ్ట్ చేసుకుంటానని చెప్పానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మొత్తానికైతే ఎంపీ ఎంవీవీ వ్యవహార శైలి నానాటికీ తీసికట్టుగా మారుతోంది.

Written By: Dharma, Updated On : June 21, 2023 6:27 pm
Follow us on

Visakha MP : విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ పై ఎన్నోరకాల అనుమానాలున్నాయి. జరిగింది ఒకటి అయితే బయటకు వెల్లడించింది మరొకటి అన్న ప్రచారం ఉంది. దీనిపై విపక్షాలు కూడా ఇదే తరహాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో కడప ముఠాల హస్తం ఉందన్న టాక్ క్రమేపీ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఎర్ర గంగిరెడ్డి పేరు వినిపిస్తోంది. కిడ్నాప్ ప్రారంభం నుంచి అనేక ట్విస్టులు, వివరణలు అంతుపట్టని విధంగా ఉన్నాయి. కిడ్నాప్ జరిగి 24 గంటలు గడిస్తే కానీ విషయం బయటకు రాలేదు. అప్పటి నుంచి ఎంపీ ఎంవీవీ మాత్రం డబ్బు కోసమే కిడ్నాప్ జరిగిందని చెప్పుకొస్తున్నారు. శతవిధాలా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది తనంతట తాను చేసి ఉంటే బాగుండేది. కానీ విపక్షాలు డిమాండ్ చేసిన తరువాతే ఎంపీ స్పందించడం విశేషం.

కిడ్నాప్ కలకలం తరువాత చాలా విషయాల్లో ఎంపీ ఓపెన్ అయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. అసలు రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్న విమర్శల నేపథ్యంలో తాను ఏపీలో వ్యాపారాలు చేయలేనని బాహటంగా ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి మైనస్ గా మారింది. తరువాత అదంతా మీడియా సృష్టేనని ఎంపీ చెప్పినా పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. అప్పటికే ఎంపీ  వ్యాపారం షిఫ్ట్ ప్రకటన ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. వాస్తవానికి ఎంపీ వైసీపీలో ఏమంత కంఫర్ట్ గా లేరు. ఎంపీ కాక మునుపే ఆయన బిల్డర్. వ్యాపారానికి మరింత అక్కరకు వస్తుందని ఎంపీగా నిలబడ్డారు. గెలుపొందారు కానీ ప్రభుత్వం ఎంపీని కంట్రోల్ చేస్తూ వస్తుందన్న టాక్ ఉంది.  దీంతో అది తట్టుకోలేక ఎంపీ బ్లాస్ట్ అయినట్టు తెలుస్తోంది.

అయితే ఎంపీ వైసీపీకి దూరమయ్యే చాన్స్ కనిపిస్తోంది. మొన్నటివరకూ ఎంపీపై విమర్శలు చేసిన టీడీపీ స్వరం మార్చింది. ఈ ఎపిసోడ్ లో ఎంపీ బాధితుడిగా మిగిలారంటూ చంద్రబాబు సానుభూతి చూపడంతో సహజంగానే వైసీపీ కన్నెర్రజేస్తోంది. తెర వెను ఎంపీ ఏదో చేస్తున్నారని అనుమానం పడుతోంది. మొన్నటివరకూ ఆర్థిక, అంగబలం ఉండడంతో ఎంపీ ఎంవీవీకే మరోసారి టిక్కెట్ ఇవ్వాలని హైకమాండ్ భావించింది. కానీ కిడ్నాప్ ఎపిసోడ్ తరువాత జరిగిన పరిణామాలతో ఆయనకు టిక్కెట్ దక్కే చాన్స్ లేదని తెలుస్తోంది. అటు ఎంపీగా పోటీచేసినా నెగ్గలేనని తెలిసిన ఎంవీవీ విశాఖ తూర్పు నియోజకవర్గం టిక్కెట్ ను కోరారు. కానీ వైసీపీ హైకమాండ్ మొగ్గుచూపలేదు. దీంతో అటు వ్యాపారం, ఇటు రాజకీయంగా కలిసి రాకపోవడంతో ఎంపీ ఓపెన్ అయ్యారని ప్రచారం నడుస్తోంది.

తాజాగా మీడియా ముందుకొచ్చిన ఎంపీ  ఎంవీవీ విపక్షాల ఆరోపణలను ప్రస్తావించారు. కిడ్నాప్ ఘటనలో నమ్మలేని నిజాలు ఉన్నాయని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నందున సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. విపక్షాల్లో అనుమానాలు ఉన్నందున సీబీఐ విచారణ చేపడితే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి వెనుకేసుకొచ్చారు. తన వ్యాపారాలుపై మీడియా చేస్తున్న అతి వల్లే తాను వ్యాపారాలను హైదరాబాద్ కు షిఫ్ట్ చేసుకుంటానని చెప్పానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మొత్తానికైతే ఎంపీ ఎంవీవీ వ్యవహార శైలి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. అటు వైసీపీ సర్కారు పుణ్యమా అని వ్యాపారాలు, ఇటు రాజకీయాలు చేయలేక సతమతమవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.