Visakha Express Robbery: దోపిడీ దొంగలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కదిలే రైలును సిగ్నల్ ట్యాంపరింగ్( signal tempering ) చేసి నిలుపుదల చేస్తున్నారు. నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా భువనేశ్వర్- సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్ లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద దోపిడీకి ప్రయత్నించగా రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. దీంతో రైలు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా ఈ తరహా ఘటనలు బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జరుగుతుంటాయి. అందుకే అక్కడ ముట్టాలపై నిఘా పెట్టారు. అయితే వరుసగా రైలు దోపిడీ ప్రయత్నాల ఘటనలు మాత్రం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Also Read: హైదరాబాదులో బాబు “మీడియా” గేమ్.. భలే రంజుగా..
పిడుగురాళ్ల సమీపంలో..
భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్కు వెళ్తోంది విశాఖ ఎక్స్ప్రెస్( Vishakha Express ). సరిగ్గా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోకి వచ్చేసరికి.. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలు నిలుపుదల చేశారు దోపిడీ దొంగలు. రైల్లోకి ప్రవేశించిన గ్యాంగ్ పై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైలు నుంచి దూకి తప్పించుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠా రైల్లో ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. ఇది బీహార్, మహారాష్ట్రలకు చెందిన ముఠాల పని అని పోలీసుల అనుమానిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో పిడుగురాళ్ల స్టేషన్లో ఇది రెండో ఘటన. శనివారం తెల్లవారుజామున విశాఖ నుంచి చర్లపల్లి కి వస్తున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్లో సైతం ఇదే మాదిరిగా దోపిడీ చేశారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును ఆపి లోపల ప్రవేశించి ప్రయాణికుల బంగారు ఆభరణాలను దోచుకుపోయారు.
Also Read: బిజెపి నూతన సారథి.. బతికించే నేతకు ఇస్తారా?
ఇటీవల వరుస ఘటనలు..
అయితే కొత్తగా ఇప్పుడు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేయడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఘటనలు సంచలనంగా మారిపోయాయి. ఇటీవల ఒంగోలు, రేణిగుంట, అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల స్టేషన్లో పరిధిలో ఘటనలు జరిగాయి. మూడు రోజుల కిందట అనంతపురం జిల్లాలో చంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలును ఆపి మహిళ మెడలో నుంచి 2.7 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. గతంలో రైలు క్రాసింగ్ కోసం ఆగినప్పుడు, రైల్వే స్టేషన్ లో కిటికీల నుంచి చేతులు పెట్టి ఆభరణాలు దొంగిలించేవారు. కానీ ఇప్పుడు సిగ్నల్స్ ను ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి దొంగతనాలు చేస్తున్నారు. అయితే ఇలా దొంగతనాలు చేస్తున్న వారిలో సోలాపూర్ గ్యాంగ్, పార్థీ గ్యాంగ్, మీర్జాపూర్ గ్యాంగ్ లతోపాటు జాంకేడ్, బీడ్ ప్రాంతాలకు చెందిన నేరస్తులు ఉన్నారని రైల్వే పోలీసులు చెబుతున్నారు. అయితే సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది రైలు ప్రమాదాలకు కూడా కారణం అవుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.