AP BJP President: మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) బిజెపికి కొత్త అధ్యక్షుడు రానున్నారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభం అయింది. రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఏకాభిప్రాయ సాధన తోనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా నేతల మధ్య పోటీ నెలకొంది. ఆశావహులు ఎక్కువమంది ఉన్నారు. ఎవరికి వారే తమకు పదవులు కావాలని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది ఎన్డీఏలో. భారతీయ జనతా పార్టీకి చాలా నమ్మదగిన స్నేహం కొనసాగిస్తోంది. దీంతో తప్పకుండా ఏపీ బిజెపి అధ్యక్ష పదవి.. టిడిపి అధినేత మనోభావాలకు దగ్గరగా ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది.
దేశవ్యాప్తంగా మిత్రులు అధికం..
దేశవ్యాప్తంగా బిజెపితో( Bhartiya Janata Party) చాలా ప్రాంతీయ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. కొన్ని పార్టీలు అయితే ఆవిర్భావం నుంచే బిజెపితో స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. మహారాష్ట్రలో శివసేన, ఒడిస్సా లో బిజెపి, పంజాబ్లో అకాలీ దళ్, కర్ణాటకలో జెడిఎస్, బీహార్లో జెడియూ, ఏపీలో తెలుగుదేశం పార్టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ బిజెపితో జత కట్టినదే. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు మరో జాతీయ పార్టీగా ఉన్న బిజెపితో జత కలిశాయి. కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉండడంతో అలా జరిగింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనం అయింది. బిజెపి బలమైన శక్తిగా మారింది. ప్రాంతీయ పార్టీలను కబళించే స్థాయికి చేరుకుంది. అందుకే స్నేహితులు కాస్త శత్రువులుగా మారారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం బిజెపికి దూరమై మళ్లీ దగ్గర అయింది. ప్రస్తుతం టిడిపి ఎన్డీఏలో కీలక భాగస్వామి కావడంతో ఏపీలో ఆ పార్టీ అవసరమైన రాజకీయ ప్రయోజనాలను దక్కించుకుంటోంది.
Also Read: హైదరాబాదులో బాబు “మీడియా” గేమ్.. భలే రంజుగా..
టిడిపి కంటే సీనియర్
వాస్తవానికి ఏపీలో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party)కంటే బిజెపి సీనియర్ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే.. బిజెపి దేశంలో రెండు పార్లమెంటు స్థానాల్లో ఉన్నప్పుడే.. విశాఖ నగరపాలక సంస్థకు జరిగిన డైరెక్ట్ ఎన్నికల్లో బిజెపి మేయర్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. అప్పుడే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బిజెపిని కలుపుకొని వెళ్లారు. అది మొదలు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం ఆ పార్టీతో కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలో జాతీయ పార్టీగా ఉన్న బిజెపి తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మిగిలిందన్న కామెంట్స్ ఉన్నాయి. మరోవైపు టిడిపి రాజకీయ ప్రయోజనాలను అనుసరించి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారన్న టాక్ కూడా ఉంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి పై టిడిపి అనుకూలముద్ర ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు తనకు అనుకూలమైన వ్యక్తిని అధ్యక్ష పదవి ఇప్పించుకుంటారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో ఉంది.
నలుగురు ఆశావహులు
రాష్ట్రంలో బిజెపి పాగా వేయాలంటే కచ్చితంగా బిజెపి సమర్థుడైన నేతను రంగంలోకి దించాలి. లేకుంటే మాత్రం గత పరిస్థితులే కొనసాగుతాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగా బిజెపి చొచ్చుకెళ్లే ప్రయత్నం ఉండదు. పక్కన ఉన్న తెలంగాణలో ( Telangana)బిజెపి బలమైన శక్తిగా కనిపిస్తోంది. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. మరో రెండు రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎలాంటి నేత బిజెపి అధ్యక్షుడిగా వస్తారో చూడాలి. ప్రస్తుతానికి ఆశావహులుగా సుజనా చౌదరి, పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, జివిఎల్ నరసింహం ఉన్నారు. సుజనా చౌదరి వైపే మొగ్గు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.