Visakha Dairy : విశాఖ డెయిరీ.. పరిచయం అక్కర్లేదు. దీనికంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తున్న డెయిరీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఉత్తరాంధ్రతో సహా ఉభయ గోదావరి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాంటి డెయిరీ రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటోంది. తాజాగా ఈ సంస్థ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. తన పదవిని సైతం వదులుకున్నారు. ఆయనతో పాటు 12 మంది డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఐదు దశాబ్దాల డెయిరీ చరిత్రలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. దానిపై ఆధారపడిన లక్షలాదిమంది రైతుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఈ డెయిరీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
* ఐదున్నర దశాబ్దాల చరిత్ర
1973లో సహకార చట్టం ప్రకారం విశాఖలోని అక్కిరెడ్డిపాలెం వద్ద ఏర్పాటు అయింది విశాఖ డెయిరీ. 50 వేల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం తో మొదలైన ఈ డెయిరీ.. ప్రస్తుతం 9 లక్షల లీటర్లకు పెరిగింది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు సైతం విస్తరించింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో మరో డైరీ ప్లాంట్ ఏర్పాటు అయింది. దీనికి సుమారు మూడు లక్షల మంది పాల సరఫరాదారులు ఉన్నారు. పాల సేకరణ, అమ్మకంతో పాటు పెరుగు, మజ్జిగ, లస్సి, వెన్న, నెయ్యి, పన్నీరు వంటిబేకరీ ఉత్పత్తులను సైతం తయారు చేస్తోంది.వీటికి ఏపీ, తెలంగాణ, చత్తీస్గడ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో మార్కెట్ ఉంది. 2025 నాటికి 2000 కోట్ల టర్నవర్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది విశాఖ డెయిరీ.
* ఎప్పటికప్పుడు మార్పులు
అయితే ఇప్పుడు విశాఖ డెయిరీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 1973లో కోపరేటివ్ సొసైటీ చట్టం ప్రకారం అడారి తులసి రావు దీనిని ఏర్పాటు చేశారు. 1999లో శ్రీ విజయ విశాఖ డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ గా రిజిస్టర్ చేశారు. 2006లో శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ గా మార్పు చేశారు. ప్రస్తుతం లిమిటెడ్ కంపెనీగా ఇది కొనసాగుతోంది. 1986 నుంచి 36 ఏళ్ల పాటు తులసిరావు చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు. తులసి రావు మరణానంతరం 2023లో ఆయన కుమారుడు ఆనంద్ కుమార్ చైర్మన్ అయ్యారు.
* వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒత్తిడికి తట్టుకొని
వాస్తవానికి అడారి తులసిరావు తెలుగుదేశం పార్టీ తోనే నిరంతరం కొనసాగే వారు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుతో సన్నిహితంగా కొనసాగే వారు. టిడిపికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలిచేవారు. 2004 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాల ఒత్తిళ్లు తులసిరావు పై ఏర్పడ్డాయి. అయినా సరే దానిని తట్టుకొని నిలబడగలిగారు తులసి రావు. లక్షలాది మంది రైతుల వ్యవహారం కావడంతో రాజశేఖరరెడ్డి కూడా తులసి రావు విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. 2014లో మరోసారి టిడిపి అధికారంలోకి రావడంతో తులసిరావు కుమారుడుఆనంద్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి అధికారంలోకి రావడంతో విశాఖ డెయిరీ టార్గెట్ అయింది. దీంతో ఆనంద్ కుమార్ వైసీపీలోకి వెళ్లక తప్పలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆనంద్ కుమార్. అప్పటినుంచి వైసిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
* టిడిపి ఆగ్రహానికి అదే కారణం
అడారి కుటుంబం నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగింది. కానీ ఆనంద్ కుమార్ వైసీపీలో చేరడంతో టిడిపిలో ఒక రకమైన ఆగ్రహానికి కారణమైంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ డెయిరీలో జరుగుతున్న ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. దీంతో పాలు పోసే రైతుల నుంచి ఉద్యోగుల వరకు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఇటీవల హౌస్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ నెల 9న డైరీని సందర్శించి విచారణ ప్రారంభించింది. త్వరలోనే కమిటీ నివేదిక సమర్పించనుంది. ఎంత లోనే చైర్మన్ ఆనంద్ కుమార్ తో సహా డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికైతే విశాఖ డెయిరీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది.