Amaravati : ఏపీ సర్కార్ దూకుడు మీద ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. నవ నగరాలతో అమరావతిని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలపాలని చంద్రబాబు భావిస్తున్నారు.గతంలో జరిగిన తప్పిదాలను అధిగమించి.. వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వపరంగా నిర్మాణాలు ప్రారంభించడమే కాదు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు ప్రారంభించేలా ఒత్తిడి పెంచనున్నారు.అయితే ప్రస్తుతం నిధుల సమీకరణ పై దృష్టిపెట్టారు చంద్రబాబు. ఇప్పటికే కేంద్రం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి ఈ నిధులను సర్దుబాటు చేయనున్నారు.అయితే ఇది రుణమా? గ్రాంటా? అని తర్జనభర్జన నడుమ.. ఇది రుణమేనని.. దానిని తీర్చే బాధ్యత తమదేనంటూ కేంద్రం ముందుకొచ్చింది. అదే సమయంలో ప్రపంచ బ్యాంకుతోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పలుమార్లు అమరావతికి వచ్చారు. ఇక్కడ నిర్మాణాలను పరిశీలించారు. ఈ తరుణంలో ఆ రెండు బ్యాంకులు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే అవి కొన్ని రకాల ఒప్పందాలు మేరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
* ఆసక్తికరంగా కండీషన్లు
ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు 6,796 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 6,796 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే నిధుల విడుదలకు ఆ రెండు బ్యాంకులు పెట్టిన కండిషన్లు ఆసక్తికరంగా మారాయి. ఆరేళ్లపాటు విడతల వారీగా ఈ నిధులు విడుదల కానున్నాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రపంచ బ్యాంకు బృందం క్షేత్రస్థాయిలో పనులను తనిఖీ చేస్తుంది. సంతృప్తి చెందితేనే మలి విడత నిధులు విడుదల చేయనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆ రెండు బ్యాంకులు స్పష్టం చేశాయి. నిర్మాణ పనులను పర్యవేక్షించనున్న ప్రపంచ బ్యాంకు.. సంతృప్తి చెందితేనే మలి విడత నిధులు విడుదలవుతాయి.లేకుంటే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది.
* ఆరు విడతల్లో రుణం
అమరావతికి రుణ మంజూరుకు సంబంధించి శుక్రవారం ప్రపంచ బ్యాంకు షెడ్యూల్ విడుదల చేసింది. అందులో కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఇలా తీసుకున్న నిధులను అమరావతి సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చించాలని స్పష్టం చేసింది. తొలి విడత రుణం కింద 348.33 కోట్లను జనవరి నెలాఖరుకు సీఆర్డీఏకు అందించనుంది. మిగతా ఐదు విడతల్లో కూడా ఇదే ఫార్ములాను అనుసరించనుంది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఇంతే కాలపరిమితతో రుణం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మొత్తం 6796 కోట్లకు గాను ఆరు విడతల్లో అందించేందుకు కసరత్తు చేస్తోంది. అదే సమయంలో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు కొన్ని లక్ష్యాలను కూడా విధించింది. ఆ లక్ష్యాలను సాధిస్తేనే తదుపరి విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే సిఆర్డిఏ త్వరలో టెండర్ల ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసింది. దానిని సైతం ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించింది. తరువాత పనులను పర్యవేక్షిస్తూ.. అన్ని సవ్యంగా ఉంటేనే నిధుల విడుదలకు ప్రపంచ బ్యాంకు సిద్ధపడుతుంది. మొత్తానికైతే నిధులతో పాటు ప్రపంచ బ్యాంకు లక్ష్యాలను సైతం పరిగణలోకి తీసుకోవాలన్న మాట