Vijayawada flood : నెలల నిండని చిన్నారిని తొట్టెలో తరలిస్తున్న తండ్రి.. ఇద్దరు చిన్నారులను భుజంపై పెట్టుకొని నాలుగు అడుగుల లోతులో ఉన్న నీటిని దాటుతున్న తండ్రి.. భార్య మృతదేహాన్ని ట్రాలీ రిక్షా పై తరలిస్తున్న భర్త.. సహాయక చర్యల్లో ఉన్న పడవపై ప్రసవించిన మహిళ.. నడుము లోతుల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాల సాయంతో బయటపడుతున్న వృద్ధులు… ఇలా ఒకటేమిటి.. విజయవాడలో ప్రతి దృశ్యం హృదయ విదారకమే. ఎటుచూడు ఆర్తనాదాలు, హాహాకారాలు. భారీ వర్షాలు విజయవాడ ను చిగురుటాకులా వణికించాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడిపారు. ఆహారం లేక, కనీసం మంచినీరు కూడా దొరకక అవస్థలు పడ్డారు. ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. ఇళ్లలో ఉండలేక బయటకి వెళ్లలేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. నెలలు నిండని చిన్నారులకు పాలు దొరకడం లేదు. దీంతో వారిని తొట్టెల్లో పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిండు గర్భిణీ వరదల వేళ ప్రసవించింది. ఆమెను తరలించే లోపే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి బోటులో తల్లీ బిడ్డలను తీసుకొచ్చారు.
* వారి పరిస్థితి దయనీయం
విజయవాడ నగరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలోనే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారు ఇళ్లలో ఉండలేక.. బయటకు వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రధానంగా నెలలు నిండని పిల్లలు పాలు కోసం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వారిని తీసుకుని తల్లిదండ్రులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
* ప్రధాన ప్రాంతాలకే పరిమితం
విజయవాడ నగరంలో వర్షం తగ్గుముఖం పట్టింది. వరద మాత్రం ఇంకా తగ్గడం లేదు. సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు బాధితులకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందిస్తున్నారు. అయితే సహాయ చర్యలు, ఆహార పంపిణీ ప్రధాన ప్రాంతాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. శివారు ప్రాంతాలకు అస్సలు ఆహారం అందడం లేదని తెలుస్తోంది. అక్కడ ప్రజలు బతుకు జీవుడా అని బతుకుతున్నట్లు సమాచారం.
* ఇప్పటికీ అదే జాప్యం
ఒకవైపు వర్షాలు, మరోవైపు వరదలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరద బీభత్సం తగ్గింది. ఇప్పుడే పునరావాస చర్యలు, సహాయ చర్యలు ముమ్మరం చేయాలి. కానీ ఈ సమయంలో సైతం జాప్యం జరుగుతోంది. దీంతో బాధితులు ప్రమాదమని తెలిసినా వరదలను దాటుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చిన్నారులను, వృద్ధులను అతి కష్టం మీద తరలిస్తుండడం బాధాకరం.
అజిత్ సింగ్ నగర్ లోని డబ్బా కొట్ల సెంటర్ సమీపంలో ఓ మహిళ ప్రసవించగా , సమాచారం అందుకున్న పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్ . వి రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్ గారు స్వయంగా బోటులో వెళ్ళి, తల్లిని మరియు బిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చి , సురక్షిత ప్రాంతానికి తరలించారు..(1/2) pic.twitter.com/8MGgusRRdx
— Vijayawada City Police (@VjaCityPolice) September 2, 2024