AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తోంది?

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. వైసిపి ఒంటరి పోరు చేయగా.. టిడిపి,బిజెపి,జనసేన లతో కూటమి కట్టింది.

Written By: Dharma, Updated On : May 15, 2024 10:57 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఒకప్పుడు రాజకీయ హింసకు బీహార్ పెట్టింది పేరు. ఉత్తరప్రదేశ్లో సైతం రాజకీయ హింస పెట్రేగేది. ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు జరిగేవి. దారుణ హత్యలు కూడా జరిగేవి. అటువంటి పరిస్థితి ఏపీలో ఇప్పుడు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏపీలో హింస చెలరేగింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో గొడవలు జరిగాయి. ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. వైసిపి ఒంటరి పోరు చేయగా.. టిడిపి,బిజెపి,జనసేన లతో కూటమి కట్టింది. వైసిపి అధికారపక్షంగా ఉండగా.. కేంద్రంలో ఉన్న బిజెపి తెలుగుదేశం పార్టీ కూ టమిలోకి రావడంతో.. పరిస్థితి నువ్వా, నేనా అన్న రీతిలోకి మారింది. వాస్తవానికి వైసీపీ శ్రేణులు కూడా దూకుడుగా ఉంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే బిజెపి కూటమిలో కలిసిందో ఒక్కో పరిణామము టిడిపికి అనుకూలంగా మారింది. ముఖ్యంగా డీజీపీ మారడం, పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు, పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడడంతో.. యంత్రాంగంలో ఒక రకమైన చేంజ్ కనిపించింది. అప్పటివరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులు సైలెంట్ అయ్యారు. దీంతో వైసిపి దూకుడుకు టిడిపి కూటమి ఎదురు చెప్పడం ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాడులు, ప్రతి దాడులు పెరిగిపోయాయి. బాధిత ప్రాంతాలు భయం మాటున గడపాల్సి వచ్చింది.

పల్నాడు ప్రాంతంలో అయితే హింస పెచ్చు మీరింది. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అధికార వైసీపీని టిడిపి కూటమి ప్రతిఘటించడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుపతి, తాడిపత్రిలో సైతం వైసిపి, టిడిపి శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. తలలు పగిలినా, కాళ్లు చేతులు విరిగిపోయిన వెనక్కి తగ్గలేదు. అయితే ఎన్నికల అనంతరం కూడా హింస కొనసాగుతూనే ఉంది. స్థానిక పోలీస్ వ్యవస్థ అధికార పక్షానికి ఇన్ని రోజులు అండగా నిలవగా.. ఇప్పుడు కూటమికి వత్తాసు పలకడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వస్తుంది. అయితే రాష్ట్రానికి ఉన్న మంచి పేరు మాత్రం పోతోంది. ఇప్పటివరకు ఉత్తరాదిన బీహార్, ఉత్తరప్రదేశ్ కు ఉన్న చెడ్డ పేరు.. ఇప్పుడు ఏపీకి అంటుకునే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల స్వార్థాలకు సామాన్యులు బలి కావడం ఆందోళన కలిగిస్తోంది.