Vijaysai Reddy: విశాఖ ఇంకా కలలోకి వస్తుందట.. విజయసాయి మరిచిపోలేకపోతున్నారా?

విశాఖలో పట్టు దక్కించుకున్న విజయసాయి రెడ్డి పై చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా విశాఖ ఎంపీ, ప్రస్తుత విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఎం వి వి సత్యనారాయణ విజయసాయి రెడ్డి పై పెద్ద ఆరోపణలే చేశారు.

Written By: Dharma, Updated On : April 12, 2024 11:02 am

Vijaysai Reddy

Follow us on

Vijaysai Reddy: వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి పై సొంత పార్టీ వారే కుట్రలు చేశారా? ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతలు నుండి తప్పించారా? అధినేతకు చాడీలు చెప్పడం వల్లే అలా జరిగిందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు విజయ్ సాయి రెడ్డి. ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన టీవీ9 ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనను బలవంతంగా విశాఖ నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందని అనుమానం వచ్చేలా మాట్లాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి.

గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసిపి మంచి విజయం సాధించింది. 34 స్థానాలకు గాను 28 చోట్ల ఆ పార్టీ గెలుపొందింది. తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాలకే పరిమితం అయింది. అయితే వైసీపీ సాలిడ్ విజయం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న ఆయన పార్టీని ఒక పద్ధతి ప్రకారం నడిపారు. విశాఖలోనే ఎక్కువ రోజులు గడుపుతూ పార్టీ వ్యవహారాలను చూసుకునేవారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం వెనుక కూడా విజయసాయిరెడ్డి కృషి ఉంది. నగరంలో తెలుగుదేశం పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. టిడిపి పటిష్ట స్థితిలో ఉండేది. మరోవైపు విశాఖ స్టీల్ ఉద్యమం బలంగా నడుస్తోంది. అటువంటి సమయంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. వైసిపికి ఇక్కడ దెబ్బ తప్పదన్న సంకేతాలు కనిపించాయి. కానీ విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి గ్రేటర్ విశాఖను వైసీపీ ఖాతాలో వేయించ గలిగారు. దీంతో విజయసాయిరెడ్డి పరపతి అమాంతం పెరిగింది. ఆయనే కచ్చితంగా ఎంపీ అభ్యర్థి అని ప్రచారం జరిగింది. కానీ హై కమాండ్ విజయసాయిరెడ్డిని తొలగించి.. ఆయన స్థానంలో వై వి సుబ్బారెడ్డి నియమించింది.

విశాఖలో పట్టు దక్కించుకున్న విజయసాయి రెడ్డి పై చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా విశాఖ ఎంపీ, ప్రస్తుత విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఎం వి వి సత్యనారాయణ విజయసాయి రెడ్డి పై పెద్ద ఆరోపణలే చేశారు. ఆపై విజయ్ సాయి రెడ్డి కుమార్తె, అల్లుడి దందా పెరిగిందని, విశాఖ భీమిలి బీచ్ కారిడార్ మార్గంలో అలైన్మెంట్ మార్చారని, విజయసాయిరెడ్డి భూముల కోసమే ఈ ప్రయత్నం చేశారన్న ప్రచారం జోరుగా సాగింది. మరోవైపు విజయసాయిరెడ్డి కుమార్తె యూనివర్సిటీ నిర్మాణానికి పెద్ద ఎత్తున భూ కేటాయింపులు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో జగన్ స్పందించారు. విజయసాయిరెడ్డిని తప్పించారు. అప్పటినుంచి ఒక ఆరు నెలల పాటు విజయసాయిరెడ్డి ఎవరికీ కనిపించకుండా పోయారు. పార్టీలోను సైలెంట్ అయ్యారు. కానీ తరువాత జగన్ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లడంతో.. అయిష్టంగానే విజయసాయి రెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

విశాఖ పార్లమెంట్ సీటుపై విజయసాయిరెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. తప్పకుండా విశాఖ నుంచి పోటీ చేస్తానని భావించారు. కానీ సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వై వి సుబ్బారెడ్డి లాంటి నేతలు తనపై కుట్ర చేశారని విజయసాయిరెడ్డి సన్నిహితులు వద్ద బాధపడుతుండేవారు. వై వి సుబ్బారెడ్డి సమన్వయకర్తగా నియమితులైన తర్వాత.. విజయసాయిరెడ్డి అనుచరులను టార్గెట్ చేసుకున్నారు. పార్టీ నుంచి బయటకు పంపించారు. అయితే తాజాగా టీవీ9 ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఇవే ప్రధాన కారణాలుగా ప్రచారం సాగుతోంది. కేవలం కొంతమంది వైసీపీ నేతలు తనపై కుట్ర చేసి విశాఖ నుంచి దూరం చేశారని.. తన మనసు ఎప్పుడూ విశాఖ పైనే ఉందని.. నెల్లూరులో అకస్మికంగా అభ్యర్థి కావాల్సి వచ్చిందని అర్థం వచ్చేలా విజయసాయిరెడ్డి మాట్లాడారు. పెద్ద చర్చకు దారి తీశారు.