RCB Vs MI 2024: వరుసగా ఓడిపోతోంది.. ఇదేం జట్టు.. ఆటగాళ్లకు సోయి ఉండడం లేదు. ఆట మీద శ్రద్ధ ఉండడం లేదు. ఇలాగైతే కష్టమే.. ఇలాగే ఆడితే నష్టమే.. ఇవీ మొన్నటిదాకా ముంబై ఇండియన్స్ జట్టు పై వినిపించిన విమర్శలు. ఇప్పుడు ఆ స్థానాన్ని బెంగళూరు ఆక్రమించింది. ఆరు మ్యాచ్ లు ఆడి ఒకే ఒక్క విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. కీలక ఆటగాళ్లు పెద్దగా ప్రతిభ చూపడం లేదు. బౌలర్లు ముందుగానే చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు పండగ చేసుకుంటున్నారు. గురువారం నాటి మ్యాచ్ లోనూ పై వాక్యాలు నిజమయ్యాయి కూడా.
గురువారం నాటి మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, జాక్స్, లామ్రోర్, సౌరవ్ చౌహన్, వైశాఖ్ విజయ్ కుమార్ వంటి వారు తీవ్రంగా నిరాశపరిచారు. కెప్టెన్ డూ ప్లెసిస్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్ ముగ్గురు ధాటిగా ఆడటంతో బెంగళూరు ఆ స్కోర్ చేసింది. వీరు ముగ్గురు కూడా మిగతా వాళ్ళ లాగే అవుట్ అయితే బెంగళూరు పరిస్థితి దారుణంగా ఉండేది. 196 పరుగులు చేసినప్పటికీ ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బెంగళూరు బౌలర్లు విఫలమయ్యారు. దారుణంగా బౌలింగ్ చేసి 15.3 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని చేదించేలా చేశారు. బౌలర్ల నిర్వాకంతో బెంగళూరు జట్టు వరుసగా నాలుగు పరాజయాలు నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.
బెంగళూరు జట్టు ఓటమిని తట్టుకోలేక అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. బెంగళూరు ఆటగాళ్లను ఏకిపడేస్తున్నారు. ముఖ్యంగా మాక్స్ వెల్ ను టార్గెట్ చేసి మీమ్స్ రూపొందిస్తున్నారు. ముంబై జట్టుతో ఓటమి అనంతరం ఇలాంటి వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. “ఐపీఎల్ లో మీరు గెలవలేరు. చివరికి నెదర్లాండ్ జట్టుతోనూ విజయం సాధించలేరు. అలా సాగుతోంది మీ ఆట.. ఇంతకుమించి మీకు ఏమి చెప్పలేం” అంటూ బెంగళూరు అభిమానులు తమ ఆగ్రహాన్ని మీమ్స్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఇవే కాదు ఇలాంటివే చాలా రూపొందించారు. దీంతో ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.. మరి వీటిని చూసిన బెంగళూరు ఆటగాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.