YCP : బెజవాడ వైసిపి ఫైర్ బ్రాండ్ లీడర్ మౌనం.. కారణం ఏంటి?

అధికారం ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు కొందరు నాయకులు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయేసరికి చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. అందులో బెజవాడ వైసిపి లీడర్ మల్లాది విష్ణు ఒకరు. ఆయన వ్యూహాత్మక మౌనం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

Written By: NARESH, Updated On : September 17, 2024 12:07 pm
Follow us on

Ex mla Mallaadi vishnu : వైసిపి ఫైర్ బ్రాండ్లలో మల్లాది విష్ణు ఒకరు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఆయన ఒక వెలుగు వెలిగారు. మంత్రి పదవి దక్కలేదు కానీ ఆయన తరచూ వార్తల్లో ఉండేవారు. అప్పట్లో ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. అయితే వైసిపి ఓటమి తర్వాత ఆయన తీరులో మార్పు వచ్చింది.విజయవాడలో ఉన్న జగన్ సమీక్షలకు హాజరు కావడం లేదు. సుదీర్ఘకాలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా.. వరద సహాయ చర్యల్లో అంతంతమాత్రంగానే పాల్గొన్నారు. దీంతోమల్లాది విష్ణు పార్టీ మారడం ఖాయమని ప్రచారం సాగుతోంది.తాను వెళ్లాల్సిన పార్టీ నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన మరుక్షణం పార్టీ మారుతారని విజయవాడ సర్కిల్లో ప్రచారం నడుస్తోంది.

* రాధాను కాదని సీటు ఇచ్చి
2019 ఎన్నికల్లో మల్లాది విష్ణు కోసం వంగవీటి రాధాకృష్ణను వదులుకున్నారు జగన్. కానీ ఈ ఎన్నికల్లో అదే మల్లాది విష్ణుకు మొండి చేయి చూపారు. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిలబెట్టారు. అయితే దీనిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు మల్లాది విష్ణు. జగన్ బుజ్జగించడంతో మెత్తబడ్డారు. కానీ సంతృప్తిగా వెల్లంపల్లి శ్రీనివాస్ కు సహకారం అందలేదని వైసీపీలో ప్రచారం నడుస్తోంది.బోండా ఉమా భారీ మెజారిటీతో గెలవడమే అందుకు ఉదాహరణ. దీంతో వైసీపీలోనే మల్లాది విష్ణు పై అనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే తనను తప్పించినా పార్టీ కోసం పని చేశానని.. తనను అనుమానంగా చూడడంపై అవమానంగా భావిస్తున్నారు మల్లాది. అందుకే పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

* వ్యాపార రీత్యా ఇబ్బందులు తప్పవని
విజయవాడ రాజకీయాల్లో మల్లాది విష్ణు చురుగ్గా ఉండేవారు. అయితే తన వ్యాపార కార్యకలాపాలు కోసం టికెట్ లభించకపోయినా వైసిపి కోసం పనిచేశారని.. వైసిపి అధికారంలోకి వస్తుందని భావించి అప్పట్లో మౌనంగా ఉన్నారని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తనకు ఇబ్బందులు తప్పవని విష్ణు భావిస్తున్నారు.అందుకే వ్యూహాత్మక మౌనం పాటించినట్లు సమాచారం.అయితే ఇప్పటికే కొన్ని పార్టీలను ఆశ్రయించారని.. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే చేరతారని తెలుస్తోంది.

* చేరేది ఆ పార్టీలోనా
అయితే ఆయన టిడిపిలో చేరతారా? లేకుంటే జనసేనలోకి జంప్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నేతలను టార్గెట్ చేసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయనకు టిడిపిలో ఛాన్స్ లేదని తెలుస్తోంది. అదే సమయంలో జనసేనకు దగ్గరవుతారని కూడా టాక్ నడుస్తోంది. అయితే ఆ రెండు పార్టీలు ప్రస్తుతానికి చేరికలకు ప్రోత్సహించడం లేదు. గేట్లు ఎత్తిన మరుక్షణం ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమని ఒక రకమైన ప్రచారం అయితే జరుగుతోంది. మరి మల్లాది విష్ణు అడుగులు ఎటుపడతాయో చూడాలి.