Vijayawada Rains: ఏపీ వ్యాప్తంగా వర్షాలు ప్రారంభం అయ్యాయి. బంగాళాఖాతంలో( bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ వర్షపాతం నమోదవుతోంది. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతానికి ఆనుకొని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది క్రమేపి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దాని ప్రభావంతోనే ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి.
వర్షపాతంలో లోటు..
సాధారణంగా జూన్లో అధిక వర్షపాతం నమోదు కావాలి. కానీ లోటు వర్షపాతం( rainfall) నమోదు అయ్యింది. జూలైలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. చివరి వారం సమీపిస్తుండడంతో వర్షాల జాడలేదు. మరోవైపు ఖరీఫ్ పనులకు ఆశగా ఎదురుచూస్తున్నారు రైతులు. ఇప్పుడు తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో ఖరీఫ్ పనులకు సిద్ధపడుతున్నారు రైతులు. కానీ ఇంకా వర్షాలు కావాలని.. కేవలం సాగునీటి వనరులు ఉన్నచోట మాత్రమే ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయి.
విజయవాడ అతలాకుతలం..
కాగా శనివారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం( Srikakulam ), విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య, రాయచోటి జిల్లాల్లో వర్షాలు కురిసాయి. అయితే విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. శనివారం రాత్రి అంతా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఫలితంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి అలుముకుంది. ఈరోజు సైతం విజయవాడలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతుండటంతో భారత వాతావరణ శాఖ ఎన్టీఆర్ జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
నేడు ఈ జిల్లాల్లో..
అయితే నేడు అల్లూరి సీతారామరాజు( Alluri Sitaram Raju ), ఏలూరు, కృష్ణ, గుంటూరు,బాపట్ల, శ్రీ సత్య సాయి పుట్టపర్తి, వైయస్సార్ కడప,అన్నమయ్య,రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురు గాలులు వీచే సమయంలో చెట్ల క్రింద, శిధిల భవనాల వద్ద నిల్చోకూడదని సూచించింది.