Vijayasai Reddy  : విజయసాయిరెడ్డి ఛానల్ సన్నాహాలు..సీఈఓ అతనే? ఆ సెక్షన్ మీడియా టార్గెట్?

తెలుగు మీడియా వర్గాలుగా ఏనాడో విడిపోయింది. ఎల్లో మీడియాతో పాటు నీలి మీడియా కొనసాగుతోంది. మధ్యలో తటస్థ మీడియా సైతం ఉంది. ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి ఛానల్ ఒకటి ఎంటర్ అవుతోంది.

Written By: Dharma, Updated On : July 25, 2024 1:08 pm
Follow us on

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి మీడియా రంగంలో అడుగుపెట్టనున్నారు. విజయదశమి నాటికి ఛానల్ ను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె బిడ్డకు తండ్రి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఆయనను కార్నర్ చేస్తూ ఓ టీవీ ఛానల్ కీలక విషయాలను బయటపెట్టింది. అదే పనిగా ప్రసారాలు చేసింది. డిబేట్ లను కూడా కొనసాగించింది. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు విజయసాయిరెడ్డి. మీడియా ప్రతినిధులతో పాటు అధినేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేతిలో మీడియా ఉంది కనుక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. త్వరలో తాను కూడా ఒక ఛానల్ ప్రారంభిస్తానని సవాల్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి సవాల్ ను అందరూ లైట్ తీసుకున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో విజయసాయిరెడ్డి ఇదే తరహా సవాల్ చేశారు. కానీ ఛానల్ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు కూడా ఆవేశంగా చేసి ఉంటారని భావించారు. కానీ ఇప్పుడు సీరియస్ గానే పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల మధ్య ఇదే చర్చి నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు మీద ఉన్న ఓ టీవీ ఛానల్ సీఈవో విజయసాయిరెడ్డి చెంతకు చేరినట్లు తెలిసింది. ఇప్పటికే సదరు సీఈఓ ఛానల్ లో తన పదవికి రాజీనామా చేశారని.. దీనికి ఆమోదం కూడా లభించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని వైసిపి లోని నాయకులు కూడా చర్చిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి టీవీ ఛానల్ ను ప్రారంభించడం సాహసమే. తెలుగు మీడియా రంగంలో విపరీతమైన పోటీ ఉంది. పైగా సాక్షి అనుకూల మీడియా కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి సొంతంగా ఛానల్ పెట్టుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా పెడుతున్నారా? లేకుంటే వైసీపీకి అనుకూల మీడియాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా? సొంత పార్టీలోతన ఎదుగుదలకు అడ్డు తగులుతున్న వారికి వ్యతిరేకంగా పెడుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

* ఆవేశంతో ప్రకటన
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం బయటకు వచ్చాక.. విజయసాయిరెడ్డి చాలా హర్ట్ అయ్యారు. మీడియా ముందుకు వచ్చి బాధపడ్డారు. ఈ కుట్రలో టిడిపి, ఎల్లో మీడియాతో పాటు సొంత పార్టీ నేతలు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో వైసీపీ నుంచి విజయసాయి రెడ్డికి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. ఏ ఒక్కరూ బాహటంగా వచ్చి మాట్లాడలేదు. అందుకే విజయసాయిరెడ్డి చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది.సొంత మీడియా పెట్టుకుంటేనే గౌరవంతో పాటు భయం ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

* సీఈవో సిద్ధం
తెలుగులో టిఆర్పి రేటింగ్ అధికంగా ఉన్న ఓ ఛానల్ సీఈవోతో విజయసాయిరెడ్డి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ఇస్తున్న వేతనానికి రెట్టింపు ఇస్తానని ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సదరు సీఈఓ ఒప్పుకున్నారని.. విజయసాయిరెడ్డి ఛానల్ లో పనిచేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ ఛానల్ ఏర్పాటుకు సంబంధించి ఎప్పటికే సన్నాహాలు ప్రారంభమైనట్లు సమాచారం. ఛానల్ కు సంబంధించి విజయసాయిరెడ్డి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అన్నీ కలిసి వస్తే ఈ ఏడాది విజయదశమి నుంచి కొత్త ఛానల్ ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీం సెలక్షన్, స్టూడియోలు, కెమెరాలు, ఎక్విప్మెంట్ అంతా ఆగమేఘాలపై పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.

* ఏ మీడియా టార్గెట్
ఇప్పటికే వైసీపీకి సొంత మీడియా ఉంది. సాక్షి ఛానల్ తో పాటు పత్రిక నడుస్తోంది. వాటితో పాటు టీవీ9, ఎన్టీవీ వంటి టాప్ చానళ్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విజయసాయిరెడ్డి సొంతంగా ఛానల్ పెడుతుండడం విశేషం. అసలు ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా పెడుతున్నారా? లేకుంటే తనకు వెన్నుదన్నుగా నిలవని నీలి మీడియాకు వ్యతిరేకంగా పెడుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.