Vijayasai Reddy : ఒకప్పటి తన సన్నిహితుడు విజయసాయిరెడ్డిని( Vijaya Sai Reddy ) మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం అరెస్టుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సుమారు నాలుగు గంటల పాటు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణంలో జరుగుతున్నవన్నీ అక్రమ అరెస్టులని ఆరోపించారు. నిజాయితీగా పని చేసిన అధికారుల అరెస్టు తగదని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఉద్దేశించి మాట్లాడారు. అసలు గోవిందప్ప బాలాజీకి ఇందులో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇంకోవైపు ఐటీ సలహాదారుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి గురించి కూడా ప్రస్తావించారు. వీరందరి గురించి గొప్పగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. తన ఒక్కప్పటి సన్నిహితుడు విజయసాయి రెడ్డి పై మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు అమ్ముడుపోయారని విమర్శించారు. మూడేళ్ల పదవీకాలం ఉండగా.. టిడిపి కూటమికి మేలు చేసేందుకే రాజీనామా చేశారని విమర్శించారు. తాజాగా దీనిపై కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.
* అదంతా కోటరీ పనే..
అయితే జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) ఆరోపణలపై ఆ తరువాత రోజే స్పందించారు విజయసాయిరెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. ఎన్నడూ నమ్మకద్రోహం చేయలేదన్నారు. తనపై ఆరోపణలు చేయడం సహేతుకం కాదన్నారు. అయితే ఇప్పుడు మరోసారి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.’ నేను మౌనంగా ఉండడం వైయస్సార్ కాంగ్రెస్ కోటరీ కి నచ్చడం లేదు. అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకడం, ఇరిటేట్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ.. జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దాం అని కోటరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి నాలుగేళ్లుగా అవమానిస్తున్నందున, లేని అబాండాలను నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. 2011లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025 లో కూడా జగన్ గారే అడిగి ఉంటే ఇప్పుడు కూడా ఆ కేసుల బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో’ అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నన్ను కెలికితే నీకే ఇబ్బంది అన్నట్టు విజయసాయిరెడ్డి హెచ్చరికలు పంపినట్టు ఉంది.
Also : విజయసాయిరెడ్డిని వదిలేదిలే.. పల్నాడు జిల్లాలో ఫిర్యాదు.. అరెస్టుకు రంగం సిద్ధం!
* జగన్ ను గౌరవిస్తూనే..
ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని గౌరవిస్తూనే కోటరీ తీరును ఎండగట్టారు విజయసాయిరెడ్డి. కేవలం కోటరీ వల్లే తాను జగన్మోహన్ రెడ్డికి, వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి దూరమైనట్లు చెప్పుకొచ్చారు. కోటరీవారే నాకు వెన్నుపోటు పొడిచారని చెబుతున్నారు. మూడు తరాలుగా వైయస్సార్ కుటుంబానికి సేవ చేసినందుకు.. తనను పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఎవరు ఓటరి చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయి రెడ్డి మంచోడు.. అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెన్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టిడిపికి అమ్ముడుపోయిన మనిషి అవుతాడా? అంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డికి గట్టి సమాధానమే పంపారు విజయసాయిరెడ్డి. కేవలం కేసుల్లో తనను ఇరికిస్తారని.. ఎమోషనల్ గా వాడుకుంటారని తెలిసి బయటకు వెళ్లిపోయానని జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. తన జోలికి వస్తే మొత్తం బయట పెడతానన్నట్టు విజయసాయిరెడ్డి మాటలు అర్థం అవుతున్నాయి.
* అనుకోకుండా కలిశాం..
మరోవైపు టిడిపి( Telugu Desam) నేతలతో చర్చలు జరిపినట్టు వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. దీనిపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లడం వాస్తవమేనని చెప్పారు. కృష్ణ గారి కుటుంబంతో తనకు అనుబంధం ఉందని.. ఆ కుటుంబ సభ్యులు తన ఇంట్లో జరిగే వివాహ వేడుకలకు సైతం హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. తాను వెళ్లే సమయానికి టిడిపి నేత టీడీ జనార్దన్ వస్తారని అనుకోలేదన్నారు. నేను ఈ జన్మలో టిడిపిలో చేరడం లేదని ఇంతకుముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని కలుస్తానే కానీ వేరే వాళ్ళతో ఎందుకు సంప్రదిస్తాను అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాం లేదని జగన్ గారు అంటుంటే.. ఇస్కాన్ రహస్యాలు టిడిపితో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకులను కలిశా అని జగన్ గారి కోటరి అంటోందన్నారు. స్కాం లేనప్పుడు నేను ఏమి చర్చిస్తానని తిరిగి ప్రశ్నించారు. సిట్ విచారణలో కేవలం ఏ1 గురించి మాత్రమే తాను మాట్లాడిన విషయాన్ని వెల్లడించారు. మొత్తానికైతే తనను కెలికితే ఎలా ఉంటుందో.. చెప్పకనే చెప్పారు విజయసాయిరెడ్డి. మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి
1/2: నేను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదు. అందుకే నాపై వైఎస్సీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 26, 2025