Vijaysai Reddy: మీడియా మొఘల్ రామోజీరావు. పచ్చళ్ళ రంగం నుంచి పత్రికా రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ జర్నీ నడుపుతున్నారు ఆయన. దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో నేరుగా పోరాడారు. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ తో పోరాటం చేస్తున్నారు. వైయస్ కాలంలో మార్గదర్శి కేసులు రామోజీరావును చుట్టుముట్టగా.. ఇప్పుడు జగన్ హయాంలో మరింతగా ఇబ్బందులు పడ్డారు రామోజీ. అందుకే ఈ ఎన్నికల్లో టిడిపి నేతలకు మించి శక్తి వంచన లేకుండా కృషి చేశారు ఆయన. బిజెపితో టిడిపి జత కలవడానికి ఆయన కూడా ఒక కారణం. మూడు పార్టీల కూటమి వెనుక అదృశ్య హస్తంగా కూడా పనిచేశారు. ఈ తరుణంలో వైసీపీకి వ్యతిరేకంగా కథనాలు వండి వార్చడంలో ముందున్నారు.
ఇటీవల నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు రాశారు. ఈ నేపథ్యంలో విజయసాయి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. రామోజీరావు తీరుపై విరుచుకుపడ్డారు. రాము అంటూ సంబోధిస్తూ.. త్వరలో తాను మీడియా రంగంలోకి అడుగు పెడతానని.. నీ అంతు తేల్చుతానని హెచ్చరించారు. ముల్లును ముల్లుతోనే తీసిన మాదిరిగా నీ మీడియాను నా మీడియాతో కొడతానని కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సిబిఐ ఎంక్వయిరీ కి సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించారు.
అయితే విజయ సాయి మీడియా సంస్థలు నెలకొల్పుతానని చెప్పడం ఇది కొత్త కాదు. గతంలో కూడా ఇటువంటి ప్రకటనలే చేశారు. అప్పట్లో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పత్రిక తో పాటు ఛానల్ ను ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం రామోజీరావు పై ఉన్న కోపంతో.. వ్యాపార కోణంలో మీడియాను ఏర్పాటు చేస్తానని చెప్పడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా నీలి మీడియా ఉంది. అందునా సీఎం జగన్ సొంత మీడియా సాక్షి ఉంది. టీవీ9 తో పాటు ఎన్టీవీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తోంది. ఇటువంటి తరుణంలో ఉన్న మీడియాను టేక్ ఓవర్ చేసి విజయ్ సాయి రెడ్డి నడిపిస్తారా? లేకుంటే కొత్తగా ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే విజయసాయి తాజా ప్రకటనతో ఔత్సాహిక జర్నలిస్టులకు మాత్రం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కే పరిస్థితి కనిపిస్తోంది.