Bangladesh MP: వలపు వల వేసి రమ్మని పిలిచి.. కిరాతకంగా చంపేసి.. బంగ్లా ఎంపీ హత్యోదంతంలో సంచలన విషయాలు

జిహాద్ హవలాదర్ అన్వరుల్ కు ప్రాణ స్నేహితులు. ఈ క్రమంలో జిహాద్ హవలాదర్ బంగ్లాదేశ్ నుంచి కోల్ కతా కు అక్రమంగా వచ్చాడు. నకిలీ పత్రాలు సృష్టించి సిమ్ లు కొనుగోలు చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 24, 2024 1:58 pm

Bangladesh MP, Anwarul Azim Anar, Honey Trapped

Follow us on

Bangladesh MP: బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు అన్వరుల్ అజీమ్ అనార్ (56) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అనార్ మే 13న కోల్ కతా లో హత్యకు గురయ్యాడు. నిందితులు అతడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని తమ వెంట తీసుకెళ్లారు. ఈ కేసు ఆ దేశంలో సంచలనం సృష్టించడంతో.. పోలీసులు జిహాద్ హవలాదార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడు చెప్పిన విషయాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

జిహాద్ హవలాదర్ అన్వరుల్ కు ప్రాణ స్నేహితులు. ఈ క్రమంలో జిహాద్ హవలాదర్ బంగ్లాదేశ్ నుంచి కోల్ కతా కు అక్రమంగా వచ్చాడు. నకిలీ పత్రాలు సృష్టించి సిమ్ లు కొనుగోలు చేశాడు. ముంబైలోని చినార్ పార్క్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ ఏర్పాట్లను షాహిన్ అనే యువతి చేసింది.. అయితే ఎంపీని అంతమొందించేందుకు షాహిన్ రెండున్నర కోట్ల రూపాయలను జిహాద్ హవలాదార్ కు ముందస్తుగా చెల్లించినట్టు తెలుస్తోంది.. అయితే అన్వరుల్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో చికిత్స కోసం కోల్ కతా వచ్చాడు. అలా వచ్చిన అతడిని నిందితులు పకడ్బందీ ప్రణాళికతో హత్య చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన అమెరికా పౌరుడు అక్తరుజ్జమాన్.. అన్వరుల్ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అక్తరుజ్జమాన్ అన్వరుల్ కు పాత స్నేహితుడు. అక్తరుజ్జమాన్ ఆదేశాల మేరకు జిహాద్ మరో ఇద్దరు కలిసి న్యూ టౌన్ అపార్ట్మెంట్ లో ఎంపీని దారుణంగా హత్య చేశారు..

అన్వరుల్ ను గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం చర్మం వలిచారు. ఎముకలు తొలగించారు. మాంసం, ఎముకలు, శరీర భాగాలను ముక్కలుగా నరికారు. వాటిని అదే ఫ్లాట్ లో ఉన్న ఫ్రిజ్ లో భద్రపరిచారు. శరీరం ముక్కలు కుళ్ళిపోయి వాసన రాకుండా ఉండేందుకు.. బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంతరం వేరువేరు ట్రాలీలలో వాటిని ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లారు. మాంసానికి మసాలాలు , పసుపు కలిపారు. అయితే వాటిని ఎక్కడ పడేశారనేది తెలియ రాలేదు. గత నెల 30న ఆన్ లైన్ ద్వారా ఒక కారు బుక్ చేసి.. అందులో ఎంపీ మృతదేహం భాగాలను తరలించారని తెలుస్తోంది. అన్వరుల్ ను చంపిన నిందితులు అదే ఫ్లాట్ లో మాంసం వండుకుని తిన్నారు. అయితే వాళ్లు తిన్నది ఎంపీ మాంసం కాదని విచారణలో తేలింది.. ఎంపీ శరీరంలో భాగాలను రెండు దశలలో యంత్రాల ద్వారా తొలగించినట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు..

అయితే ఎంపీ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ పేర్కొన్నారు. ” బెంగాల్ సిఐడి విభాగం న్యూటౌన్ అపార్ట్మెంట్ లోపల రక్తపు మరకలను ఐడెంటిఫై చేసింది. ఎంపీ శరీర భాగాలను తరలించేందుకు ఉపయోగించిన పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకుంది.. ఎంపీని ముందుగా గొంతు పిసికి చంపారు. ఆ తర్వాత అతడి శరీర భాగాలను తొలగించి.. ముక్కలు ముక్కలుగా చేసి.. తరలించారు. మృతదేహాన్ని గుర్తించకుండా చర్మాన్ని వలిచారు. ఎంపీని చంపేందుకు నిందితులు ఐదు కోట్లు సుఫారిగా మాట్లాడుకున్నారు. ఇందుకు గాను వారు 2.5 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నారని” హోం మంత్రి వెల్లడించారు.

ఈ కేసులో షాహిన్ అనే యువతి కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈమె అఖ్తరుజ్జమాన్ స్నేహితురాలు. ఎంపీ అన్వరుల్ కు వలపు వల విసిరింది ఈమె. న్యూ టౌన్ అపార్ట్మెంట్ కు ఎంపీ ని రప్పించింది. ఆ తర్వాత ఎంపీని నిందితులు హత్య చేశారు. ఈ కేసులో సియామ్ హుస్సేన్, ముస్తాఫిజుర్ కీలకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు..కోల్ కతా పోలీసుల ఆధీనంలో ఉన్న జిహాద్ ను విచారించేందుకు బంగ్లాదేశ్ పోలీసులు కోల్ కతా వస్తారని తెలుస్తోంది.. మరోవైపు పోలీసులను జిహాద్ తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. అతను చెప్పిన సమాచారం ప్రకారం వెతకాగా ఎంపీ శరీర భాగాలు లభ్యం కాలేదు.