Vijayasai Reddy: విజయసాయిరెడ్డి( Vijay Sai Reddy) పూర్తిగా మారిపోయారు. అలా మారిపోయినట్టు పూర్తిగా కనిపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2024 వరకు ఆయన నోటి నుంచి రాని మాటలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పించి ఆయన ఏ నాయకత్వాన్ని సమర్థించిన దాఖలాలు లేవు. ఒకవేళ అలా సమర్ధించాలి అనుకున్న దాని వెనుక ఏదో పరమార్థం ఉండేది. ఐదేళ్ల కాలంలో ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా కేంద్ర పెద్దలను అభినందించేవారు. ఆకాశానికి ఎత్తేసేవారు. ఎందుకంటే వైసీపీతోపాటు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల అభయం అవసరం. అందుకే అప్పట్లో ఒక ప్రత్యేక ఏజెన్సీ పెట్టి కేంద్ర పెద్దలకు పొగిడే బాధ్యతను కట్టబెట్టారు. వారికి తన సోషల్ మీడియా అకౌంట్ లను అప్పగించారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ.. మరో వ్యక్తి గురించి కానీ ఇష్టపూర్వకంగా మాట్లాడే వారు కాదు. అటువంటిది ఇప్పుడు హిందూ మతం పై అభిమానం చూపుతున్నారు. హిందూ మతానికి సంబంధించిన ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకుంటున్నారు.
* ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని..
సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థను కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). ఇతర మతాలకు సంబంధించిన సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన మాదిరిగానే.. హిందూ మత ధార్మిక సంస్థలకు సైతం వర్తింపజేయాలన్నది పవన్ కళ్యాణ్ అభిమతం. గత కొద్ది రోజులుగా దీనిపైనే గట్టి పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రెండు రోజుల కిందట తమిళనాడులో హిందూ అనుకూల తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పై అభిసంశనకు ఇండియా కూటమి సిద్ధపడింది. దీనిని తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు పంపారు. ఇండియా కూటమికి ఇదేం పని అని నిలదీశారు. ఆ సందర్భంలో కూడా సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు.
* పవన్ డిమాండ్ మాదిరిగానే..
తాజాగా విజయసాయిరెడ్డి సైతం హిందూ ధార్మిక సంస్థల నిర్వహణకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ చేశారు. ఇతర మతాల మాదిరిగా ప్రభుత్వాల నియంత్రణ లేకుండా చూడాలని కోరారు. తద్వారా పవన్ కళ్యాణ్ అభిమతమే తనది అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. గత 20 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ తనకు పరిచయం అని.. పవన్ కు తాను అభిమానిని చెప్పుకున్నారు విజయసాయిరెడ్డి. అయితే ఆయన సడన్గా ఇలా ఎందుకు మారిపోయారో తెలియడం లేదు. వైసిపి హయాంలో ఇదే పవన్ కళ్యాణ్ గురించి అనరాని మాటలు అన్నారు. చాలా రకాల విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మాట ఈ దేశానికి అవసరం అని మాట్లాడుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో మతమార్పిడుల గురించి వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మతమార్పిడులు జరిగాయని అర్థం వచ్చేలా మాట్లాడారు. తద్వారా ఆయన ఏదో ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ నుంచి. అది తన కేసుల నుంచి రక్ష.. లేకుంటే జనసేనలో చేరిక.. అనేది తెలియాల్సి ఉంది.