Vijaya Sai Reddy: వైసిపి మాజీ నాయకుడు.. విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీని ప్రకటించారు. పరివర్తన రాజనీతి పార్టీ అంటూ దానికి పేరు పెట్టారు. జెండాను కూడా ఆవిష్కరించారు. దేశభక్తి.. ప్రజల సంక్షేమం.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణ తమ ప్రధాన లక్ష్యాలని ఆయన ప్రకటించారు.
విజయసాయి రెడ్డికి ఉన్న అవకాశాలు ఏంటి
వైసిపి నుంచి నాయకులు బయటికి వస్తారా.. ఇది ఈ పార్టీకి సంబంధించిన కీలకమైన అంశం. విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీలో కీలక నాయకుడు. జగన్ కు అత్యంత సన్నిహితుడు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. పార్లమెంటు వ్యవహారాలలో కీలకపాత్ర పోషించారు. గత ఎడాది జనవరిలో రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు కొత్త పార్టీని ప్రకటించారు.
కొత్త పార్టీ ప్రకటించిన విజయ సాయి రెడ్డికి వైసీపీలో ఉన్న పాత పరిచయాలు ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీలో ప్రాధాన్యం కోల్పోయిన నాయకులు.. జగన్ నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్న నాయకులు.. రాజకీయంగా కొత్త వేదిక కోసం ఎదురుచూస్తున్న యువ నాయకులు విజయసాయి రెడ్డికి ఉపయోగపడే అవకాశం ఉంది.
విజయసాయిరెడ్డి తన పార్టీని కేవలం వైసీపీకి ప్రత్యామ్నాయంగా కాకుండా టిడిపి.. వైసిపి.. జనసేనకు భిన్నమైన రాజకీయ వేదికగా పరిచయం చేశారు. ఈ ప్రకారం ఆయన మూడు పార్టీలకు బయట ఉన్న ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయసాయి రెడ్డి ప్రకటించిన ప్రతిపాదనలలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. 25 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న యువతకు 66% టికెట్లు ఇస్తారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తారు. సౌర విద్యుత్ ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు భృతి కల్పిస్తారు. ఇవి ఆయన గతంలో ప్రకటించిన ప్రతిపాదనలు.
విజయసాయిరెడ్డికి నెల్లూరు ప్రాంతంలో పాటు ఉత్తరాంధ్రలో రాజకీయ పరిచయాలు ఉన్నాయి. జగన్ తో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుడు ఇప్పుడు రాజకీయ వేదిక ఏర్పాటు చేయడం ఏపీ రాజకీయాలలో సంచలన పరిణామం లాగా మారింది. ఇది వైసిపి రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ సంస్థ గతంగా బలపడాలి. అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలి. ప్రజల్లోకి తన విధానాలను తీసుకెళ్లాలి. ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి ముందు ఉన్న లక్ష్యాలు.
విజయసాయి రెడ్డి పార్టీ పెట్టడం రాజకీయంగా కీలక పరిణామం. కానీ పార్టీ ఆవిర్భావ సభలో కనిపించే జనసమూహం కంటే.. ఆ తర్వాత గ్రామాలలో ఏర్పడే పార్టీ కమిటీలు.. చేరే నాయకులు.. ప్రజా సమస్యలపై చేసే పోరాటాలు.. వంటివి ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
https://t.co/sLrbgovdyT
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 11, 2026