Vidadala Rajini Kidnapped: విడదల రజిని కిడ్నాప్ కు గురయ్యారు. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. మంత్రి విడదల రజిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ.. నామినేషన్ వేసేందుకు వచ్చిన విడదల రజినిని ప్రత్యర్ధులు కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీసింది. కానీ మంత్రి విడదల రజిని వేరు.. కిడ్నాప్ నకు గురైన విడదల రజిని వేరు అంటూ తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన విడదల రజిని ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభలో అతి చిన్న వయస్కురాలిగా నిలిచారు. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ ను సొంతం చేసుకున్నారు. అయితే నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోయారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోలేకపోయారు. దీంతో ఆమెకు జగన్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేశారు. గత మూడు నెలల కిందట నుంచే అక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు విడదల రజిని. ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా బలమైన మహిళ నేతను బరిలో దించింది.దీంతో అక్కడ గట్టి ఫైట్ నెలకొంది.గెలిచేందుకు ఏ చిన్న అవకాశాన్ని సైతం తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టడం లేదు.
అయితే ఈ తరుణంలో విడదల రజిని అనే పేరున్న మహిళ తారసపడింది. ఆమెతో ఇండిపెండెంట్ గా పోటీ చేయిస్తే మంత్రి విడదల రజినీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని టిడిపి భావించింది. ఈరోజు నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు కావడంతో సదరు మహిళ నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ ఆఫీస్ కి వెళ్ళింది. దీంతో తమకు ఎదురు దెబ్బ తప్పదని వైసీపీ నేతలు భావించారు. ఆమెతో నామినేషన్ వేయకుండా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెను అడ్డగించినట్లు తెలుస్తోంది. దీంతో విడదల రజిని కిడ్నాపునకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే విడదల రజిని కిడ్నాప్ కలకలం వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.