RK Roja and Vidadala Rajini: ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. అధినేతకు ధిక్కారం ఉండదు. ఎదిరించేవారు అస్సలు ఉండరు. కానీ అది అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. అధికారం కోల్పోయిన తరువాత విధేయత అనేది పక్కకు వెళ్ళిపోతుంది. రాజకీయం అంటే కేవలం అవసరం అన్నట్టు పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )విషయంలో అదే జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కోనేత ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అడుగులు వేసిన నేతలు సైతం జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ పరిస్థితిని చూస్తున్న అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఆశ్చర్యపోతున్నారు. గత కొద్దిరోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మహిళ నేతలు అసలు తాడేపల్లి కి రావడం మానేశారట. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చర్చ అయితే జరుగుతోంది.
వైసీపీ ద్వారా చాన్స్..
మాజీ మంత్రి ఆర్కే రోజా( RK Roja) గురించి చెప్పనవసరం లేదు. సినిమాల ద్వారా ఆమె అందరికీ సుపరిచితురాలు. రాజకీయాల్లోకి వచ్చాక నిత్యం వార్తల్లో నిలిచేవారు. గట్టిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీలో ప్రవేశించారు. కానీ అక్కడ సరిగ్గా రాణించలేకపోయారు. రెండుసార్లు టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాజశేఖర్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనను కలిశారు. అయితే కొద్ది కాలానికి రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో చనిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో తన చిరకాల వాంఛ అయినా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో రెండోసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలు నగిరి నియోజకవర్గంలో తనను ఇబ్బంది పెడుతున్నారని అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కానీ జగన్ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తాడేపల్లి కార్యాలయం వైపు కూడా రావడం మానేశారు.
అదృష్టం అంటే ఆమెదే..
రాజకీయంగా అదృష్టం అంటే మాజీమంత్రి విడదల రజనీది(Rajani ). ఎందుకంటే పోటీ చేసిన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తొలిసారి మంత్రి పదవి కూడా చేపట్టారు. దీనికి ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ, అవకాశం కారణం. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరురాలుగా, ద్వితీయ శ్రేణి నాయకురాలిగా ఉండేవారు రజని. కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చారు. మంత్రి పదవి కూడా కల్పించారు. ఆమెపై వ్యతిరేకత ఉందన్న కోణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పంపించి టికెట్ కేటాయించారు. అయినా సరే ఓటమి ఎదురయ్యింది. అయితే రేపల్లె వెళ్ళమని కోరగా ఆమె ససే మీరా అంటున్నారు. అయితే ఇప్పుడు అధినేత పై ఆగ్రహంతో తాడేపల్లి వైపు రావడం మానేశారు.
రజనీకి లైన్ క్లియర్..
అయితే ఒకటి మాత్రం నిజం మాజీ మంత్రులుగా ఉన్న ఈ మహిళా నేతలు ఇద్దరు వేరే పార్టీలో చేరుతామంటే చాన్స్ లేదు. రోజా కంటే రజనీ నయం. ఎందుకంటే రోజా మాదిరిగా అడ్డగోలుగా ఆమె మాట్లాడలేదు. అందుకే రజనీ విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంది. అది కూడా జనసేన నుంచి సానుకూలత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. రాజకీయంగా ఆయనతో రజనీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే త్వరలో ఆమె జనసేనలో చేరడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. కానీ రోజా ఉంటే వైసిపి లోనే ఉండాలి.. లేకుంటే సినిమాల్లోకి వెళ్ళాలి. అది కూడా తమిళ సినిమా, బుల్లితెరలోనే ఆమెకు అవకాశాలు అని తెలుస్తోంది.