Vice Presidential Election: దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి( Indian vice president) ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి రాజకీయ పరిణామాలు కూడా మారనున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ భవిష్యత్తు, ఇండియా కూటమి బలోపేతం వంటి వాటికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కొలమానం కానున్నాయి. ఎన్డీఏ కూటమికి 420 పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి సైతం 300 మార్కు దాటి ఉన్నాయి. ఎన్డీఏదే గెలుపు అనే స్పష్టంగా చెప్పవచ్చు కానీ.. క్రాస్ ఓటింగ్ అనేది ఇప్పుడు ప్రధాన భూమిక పోషించనుంది. అయితే ఎన్డీఏ అభ్యర్థిని ఓడించే స్థాయిలో క్రాస్ ఓటింగ్ ఉండదు కానీ.. ఎన్డీఏకు ఓట్లు తగ్గి.. ఇండియా కూటమికి పెరిగితే మాత్రం ప్రమాదకరమే. అదే జరిగితే దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఒకేసారి మారే అవకాశం ఉంది.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
* సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్..
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. రాత్రికి విజేతను ప్రకటించనున్నారు. అయితే క్రాస్ ఓటింగ్ భయం రెండు కూటమిలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇండియా కూటమికి ఓట్లు పెరిగితే మాత్రం.. ఎన్డీఏకు ప్రమాద ఘంటికలే. కానీ ఎన్డీఏ కూటమికి అనుకున్న ఓట్లు లభిస్తే మరికొన్ని రోజులపాటు ఇవే రాజకీయ పరిణామాలు కొనసాగనున్నాయి. ఎన్డీఏ నుంచి ఇండియా కూటమికి క్రాస్ ఓటింగ్ జరిగితే అందరి చూపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే. ఇప్పటికే తటస్థ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ మాత్రం ఎన్డీఏకు మద్దతు తెలిపింది.
* అనుమానాలకు కారణాలు అవే..
ఎన్డీఏ తో ( NDA)పాటు ఇండియా కూటమికి దూరంగా దేశంలో చాలా పార్టీలు తటస్థంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒడిస్సాలోని బీజేడీ, తెలంగాణలోని బిఆర్ఎస్ తటస్థంగా ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ కూటమికి తమ మద్దతు లేదని చెప్పుకున్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బిజెపి అడిగిందే తడువుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. కానీ 2024 ఎన్నికల్లో అదే కూటమి వైసిపి పై పోటీ చేసి గెలిచింది. అయితే ఒకవైపు ఎన్డీఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో వైసీపీ ఎంపీ ఒకరు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అప్పటినుంచి బిజెపి హై కమాండ్ సైతం అనుమానపు చూపులు చూస్తోంది. ఇప్పుడు గాని క్రాస్ ఓటింగ్ జరిగితే అది కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని అనుమానం రాక తప్పదు. ప్రస్తుతం ఎన్డీఏ పక్షాలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంతో 438 ఓట్లు రావాలి. అందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు 11. ఏమాత్రం ఇందులో ఓట్లు తగ్గినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఓట్లు క్రాస్ అయినట్టే. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత దీనిపై ఒక క్లారిటీ రానుంది. ఎన్డీఏకు ఓట్లు తగ్గితే మాత్రం.. జాతీయ మీడియాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక వనరుగా మిగలనుంది.