YS Raja Reddy: అసలు వైయస్ షర్మిల ప్లాన్ ఏంటి? ఆమె కుమారుడు రాజారెడ్డి తెరపైకి రావడం వెనుక వ్యూహం ఏంటి? కుమారుడ్ని సహకారానికి తీసుకొచ్చారా? లేకుంటే తన బలం చాలదని భావిస్తున్నారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజకీయంగా సక్సెస్ ఉంటేనే తమ పిల్లలను ఆ రంగంలోకి తీసుకొస్తారు. కానీ ఇప్పుడు షర్మిలకు ఇంతవరకు ఎటువంటి పదవి దొరకలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ బలపడడం లేదు. ఇటువంటి స్థితిలో తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చారంటే.. కచ్చితంగా అది ఆలోచించదగ్గ విషయమే. రాజశేఖర్ రెడ్డి పిల్లలుగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అన్న కోసం షర్మిల గట్టిగానే కృషి చేసేవారు. చాలా అభిమానంతో గడిపేవారు. కానీ ఆస్తులు, కుటుంబ వ్యవహారాల పుణ్యమా అని వారి మధ్య చీలిక వచ్చింది. వ్యక్తిగత వివాదాల వరకు పరిస్థితి నడిచింది. అయితే ఉన్నట్టుండి షర్మిల కుమారుడు రాజారెడ్డి ఆమె వెంట కనిపించడం.. రాజకీయ వేదికలపై కనిపిస్తుండడం మాత్రం కొత్త సంచలనాలకు దారితీస్తోంది.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
* చివరికి కాంగ్రెస్ పార్టీలో..
తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు షర్మిల. సోదరుడు వైసిపి రూపంలో ఏపీలో అధికారంలో ఉండడంతో.. తెలంగాణలో తన తండ్రి పేరిట ఒక పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. అక్కడ పాదయాత్ర కూడా చేశారు. కానీ తెలంగాణ ప్రజలు ఆమెను గుర్తించలేదు. దీంతో లాభం లేదనుకొని తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీలో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను తీసుకున్నారు. అయితే గడిచిన ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. అయినా సరే కూటమికంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు షర్మిల. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకోవడం నిజంగా సంచలనమే. కచ్చితంగా దీని వెనుక వ్యూహం ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
* పతాక స్థాయికి ఆస్తి వివాదాలు..
ప్రస్తుతం సోదరుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదిస్తున్నారు. తన తండ్రి ద్వారా దఖలు పడిన ఆస్తిలో వాటా ఇవ్వాలని అడుగుతున్నారు. పైగా సరస్వతి పవర్ భూములలో తన వాటాలను కుమార్తెకు బదలాయించారు విజయమ్మ. దీంతో చెల్లి, తల్లిపై కోర్టులో కేసులు కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ఈ వివాదాలు మరింత ముదిరాయి. మీరు కలుసుకోలేని విధంగా ఇబ్బందిగా పరిణమించాయి. అయితే కుటుంబ పరంగా తనకు ఇబ్బందులు పెడుతున్న సోదరుడు జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ తీయాలని షర్మిల భావిస్తున్నారు. అందుకు తాను ఒక్కదానినే సరిపోనని ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా పొలిటికల్ సీన్ మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా కూటమి బల్పడే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కుమారుడు రాజారెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలపడితే తన కుమారుడిని సైతం.. భావి నాయకుడిగా ప్రాజెక్ట్ చేసుకోవాలని షర్మిల చూస్తున్నట్లు సమాచారం. అందుకే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని రాజారెడ్డి భావిస్తున్నారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డిని దెబ్బతీయాలన్నది ఒక వ్యూహం కాగా.. రాహుల్ గాంధీ టీమ్ లో రాజారెడ్డిని పెట్టాలన్నది షర్మిల ఆలోచనగా తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.