Vemuri Radhakrishna: సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి జూబ్లీహిల్స్ పత్రిక కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఉద్యోగులు వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వాస్తవానికి ఈ ప్రమాదం రాధాకృష్ణకు భారీగానే నష్టాన్ని మిగిల్చింది.. ఈ ప్రమాద నేపథ్యంలో నాడు రాధాకృష్ణను అనేకమంది పరామర్శించారు. అందులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. కెసిఆర్ స్వయంగా వెళ్లి నాడు ప్రమాదం జరిగిన ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని పరిశీలించారు. రాధాకృష్ణతో చాలాసేపు మాట్లాడారు. రాధాకృష్ణకు.. కెసిఆర్ కు దగ్గరి రిలేషన్ ఉంది. రాధాకృష్ణ పాత ఆంధ్రజ్యోతి పేపర్ లో టిడిపి బీట్ చూసేవారు. అప్పట్లోనే కెసిఆర్ తో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని కొన్ని సందర్భాలలో గొప్పగా.. మరికొన్ని సందర్భాలలో విమర్శిస్తూ రాధాకృష్ణ తన పత్రికలో రాసేవారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా.. విమర్శలు వచ్చినా రాధాకృష్ణ వెనుకడుగు వేసేవారు కాదు.
కెసిఆర్ తో మొదట్లో కొనసాగిన అనుబంధం.. ఆ తర్వాత ఎందుకో విరోధం లాగా మారింది . దీంతో కెసిఆర్, రాధాకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కేటీఆర్, హరీష్ రావు వంటి వారు ఆంధ్రజ్యోతి పత్రికలో ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఏబీఎన్ ఛానల్ నిర్వహించే డిబేట్ లలో పాల్గొంటూనే ఉన్నారు.
ఇక ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాధాకృష్ణకు అత్యంత సన్నిహితుడు. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా అదే స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వేమూరి రాధాకృష్ణ కే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఇప్పుడు రాధాకృష్ణ కొత్త భవనం కట్టుకున్నారు. ఆ భవనంలోకి ఇటీవల తన ఛానల్.. తన పత్రికను మార్చుకున్నారు. దసరా పండుగ రోజు పూజలు చేసి నూతన కార్యాలయాన్ని రాధాకృష్ణ ప్రారంభించారు. వాస్తవానికి ఈ కార్యాలయం ప్రారంభానికి ముఖ్యమంత్రి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ రాధాకృష్ణనే.. కొంతమంది మిత్రుల సమక్షంలో కార్యాలయం ప్రారంభించారు. అయితే నాడు సీఎంకు తీరిక లేదా.. రాధాకృష్ణ పిలువ లేదా.. లేక ఇంకా ఏమైనా బిజీ షెడ్యూల్ ఎదురైందా అనే విషయం తెలియదు గానీ.. మొత్తానికి కొత్త కార్యాలయం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి వీలు చూసుకుని వచ్చారు. రాధాకృష్ణ నిర్మించిన కొత్త కార్యాలయాన్ని పరిశీలించారు. రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను.. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని.. తన వద్దకు పిలిపించుకునే సత్తా రాధాకృష్ణ సొంతం చేసుకున్నారు. దీనిని బట్టి రాధాకృష్ణ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చని మీడియా విశ్లేషకులు అంటున్నారు. గతంలో రామోజీరావు ఇలాగే తన వద్దకు అందరిని పిలిపించుకునేవారు. మీడియా మొగల్ లాగా ఆయన పేరు పొందారు. ఇప్పుడు రామోజీరావు లేరు కాబట్టి.. ఆస్థానాన్ని అధిష్టించడానికి రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నారని చర్చ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాధాకృష్ణ దగ్గర భలే మంత్రదండం ఉంది. అందువల్లే ఆయన పవర్ హౌస్ లాగా వెలిగిపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు.