Vasireddy Padma : పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నాయకుల జాబితాలో ఇప్పుడు ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా చేరారు. బుధవారం ఆమె వైసిపికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి వెళ్తూ వెళ్తూ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడంలేదని.. కష్టపడుతున్న వారిని విస్మరిస్తున్నారని పద్మ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కి అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తున్నారని.. వారిని మరోసారి మోసం చేయడానికి గుడ్ బుక్ పేరుతో తెరపైకి వస్తున్నారని విమర్శించారు. వైసీపీని ఒక వ్యాపార సంస్థ లాగా మార్చి.. జగన్మోహన్ రెడ్డి అపఖ్యాతిని మూటగట్టుకున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ గురించి ఆలోచించకూడదని.. ఆయనకు గుండె బుక్ కావాలని.. దానికోసమే ఆయన తాపత్రయపడాలని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు.
ప్రజారాజ్యం పార్టీ నుంచి..
వాసిరెడ్డి పద్మ తన రాజకీయ జీవితాన్ని ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. నాడు టిడిపి, జనసేన మహిళా నేతలను విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉండి కూడా జగన్ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో ఆమె జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే జగన్ ఆ విషయాన్ని తిరస్కరించారు. జగ్గయ్యపేట అప్పటి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీ నుంచి వెళ్లిపోయినప్పటికీ వాసిరెడ్డి పద్మను జగన్ పట్టించుకోలేదు. పైగా ఉన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి నుంచి కూడా ఆమెను తొలగించారు. కనీసం ఆమెకు విలేకరుల సమావేశాలు నిర్వహించే అవకాశం కూడా ఇవ్వలేదు. పార్టీ వాణి ని వినిపించే సౌలభ్యం కూడా కల్పించలేదు. దీంతో వైసీపీలో ఉంటే భవిష్యత్తు లేదనుకొని వాసిరెడ్డి పద్మ కొన్నాళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. పైగా ఇటీవల వచ్చిన శ్యామల రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడం వాసిరెడ్డి పద్మకు రుచించడం లేదు. దీంతో ఆమె జగన్మోహన్ రెడ్డి తీరును నిరసిస్తూ బుధవారం పార్టీకి రాజీనామా చేసింది. జగన్మోహన్ రెడ్డి లోని తప్పులను ఎత్తి చూపిస్తూ ఒక ఘాటు లేఖ రాసింది. ఆ తర్వాత నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చోటుచేసుకున్న సంఘటనలను ఒక్కొక్కటిగా వివరించింది. ” జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఏపీలో మహిళలకు దేవతల కాలం అంటూ రాలేదు. నాడు కూడా దారుణాలు జరిగాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎవర్నీ పరామర్శించలేదు. హోంమంత్రి కూడా ఎవరినీ కలవలేదు. నాడు అంతటి దారుణాలు జరిగినా పట్టించుకోని వారు.. నేడు ఏదో ఒక సంఘటన జరిగితే ఇంతలా ఎగిరి పడుతున్నారని” పద్మ వ్యాఖ్యానించారు.
జనసేనలోకి వాసిరెడ్డి పద్మ..
మరోవైపు వాసిరెడ్డి పద్మ జనసేనలోకి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమెను తమ పార్టీలోకి రానిచ్చేది లేదని జనసేన నాయకులు అంటున్నారు.. కాగా, వాసిరెడ్డి పద్మ విమర్శల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మారాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటుంటే.. ఇన్నాళ్లు పదవిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాసిరెడ్డి పద్మకు దేవుడిలా కనిపించారని.. అధికారం పోగానే ఆయనలో ఉన్న అవలక్షణాలు ఆమెకు దర్శనమిస్తున్నాయని.. రాజకీయాలలో ఇలాంటివి సర్వసాధారణమని.. జగన్ మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని వైసీపీ నాయకులు అంటున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Vasireddy padma says that jagan needs to change by pointing out the flaws in ycp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com