Vangaveeti Radhakrishna  : వంగవీటి రాధాకృష్ణకు గుండెపోటు.. అభిమానుల్లో కలవరం

వంగవీటి మోహన్ రంగ వారసుడిగా తెరపైకి వచ్చారు రాధాకృష్ణ. 2004లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పిదాలు జరగడంతో పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు.

Written By: Dharma, Updated On : September 26, 2024 10:26 am

Vangaveeti Radhakrishna

Follow us on

Vangaveeti Radhakrishna : టిడిపి యువ నేత, కాపు సంఘం నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గుండెపోటుకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.వెంటనే కుటుంబ సభ్యులు విజయవాడ నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు పరీక్షలు చేసి స్వల్ప గుండె పూర్తిగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయం తెలియడంతో వంగవీటి అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున రాధాకృష్ణ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇంకోవైపు అన్ని పార్టీల నేతలు రాధా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అయితే ఆయనకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని.. అందులో ప్రమాదం ఏదీ లేదని..48 గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.దీంతో వంగవీటి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కొద్ది రోజుల కిందటే ఆయనకు వివాహం జరిగింది. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు సైతం ఆందోళన చెందుతున్నారు. రాధాకృష్ణ సేఫ్ గా ఇంటికి చేరుకోవాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.ఆయన పేరుతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

* కూటమి తరుపున ప్రచారం
ఈ ఎన్నికల్లో కూటమి తరుపున వంగవీటి రాధాకృష్ణ విస్తృతంగా ప్రచారం చేశారు.కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు. అందుకే ఈసారి వంగవీటి రాధాకృష్ణకు ఏదో ఒక పదవి ఖాయమని ప్రచారం సాగింది. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్న సంగతి తెలిసిందే.రాధాకృష్ణకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి కానీ.. ఎమ్మెల్సీ కానీ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఒకానొక దశలు క్యాబినెట్లో మిగిలిన ఒక మంత్రి పదవి ఆయన కోసమేనని టాక్ నడిచింది. అయితే ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురికావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

* 2004లో తొలిసారిగా ఎమ్మెల్యే
వంగవీటి మోహన్ రంగా రాజకీయ వారసుడిగా 2004లో తెరపైకి వచ్చారు రాధాకృష్ణ. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు.అత్యధిక మెజారిటీతో గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే తర్వాత రాజకీయ నిర్ణయాల్లో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా.. చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు రాధాకృష్ణ. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

* జగన్ తో అడుగులు
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో సైలెంట్ అయ్యారు. తరువాత జగన్ వైసీపీ ఏర్పాటు చేయడంతో ఆయన వెంట అడుగులు వేశారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ నగరం నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2019లో వైసీపీ టికెట్ లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. కానీ టిడిపికి ఓటమి ఎదురైంది. గత అనుభవాల దృష్ట్యా రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.

* గత ఐదేళ్లుగా టిడిపిలోనే
గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ఆహ్వానించినా.. ఆ పార్టీలో చేరలేదు రాధాకృష్ణ. వైసీపీలో సన్నిహిత నేతల నుంచి ఒత్తిడి ఎదురైనా తిరస్కరించారు. ముఖ్యంగా లోకేష్ తో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. టిడిపి కూటమి గెలవడంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే పార్టీ సైతం రాధాకృష్ణ పేరును పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఎటువంటి ప్రమాదం లేదని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.