Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మోహన్( Vallabhaneni Vamsi Mohan ).. ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ కూడా చేసేవారు. అయితే ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ ఓడిపోవడం, జైలుకు వెళ్లడం.. ఇలా అన్ని జరిగిపోయాయి. అయితే ఇప్పుడు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ మోహన్ పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన సీరియస్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం ఇన్చార్జిగా ఆయననే కొనసాగిస్తోంది. అదే సమయంలో అక్కడ పార్టీ క్యాడర్ కూడా వంశీ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది.
* తనకంటూ ఒక ముద్ర..
కృష్ణా జిల్లా( Krishna district) రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు వల్లభనేని వంశీ మోహన్. తన స్నేహితుడు కొడాలి నానితో పాటే టిడిపిలోకి ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ. 2004లో టికెట్ ఆశించారు కానీ ఎక్కడా ఛాన్స్ దక్కలేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడానికి పరిమితం అయ్యారు. 2009 ఎన్నికల్లో మాత్రం విజయవాడ పార్లమెంట్ టిడిపి టికెట్ వల్లభనేని వంశీకి దక్కింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న లగడపాటి రాజగోపాల్ గెలిచారు. అయితే వల్లభనేని వంశీకి అనూహ్యంగా 2014లో గన్నవరం టికెట్ లభించింది. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి గెలిచారు. అయితే అక్కడ కు కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అయితే అదే రాజకీయ తప్పిదం అయింది అన్నది ఒక వాదన. 2024 ఎన్నికల్లో అయితే ఘోరంగా ఓడిపోయారు. అదే టిడిపిలో కొనసాగి ఉంటే గన్నవరం నుంచి ఆయనదే హ్యాట్రిక్ విజయం. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి.. అక్కడ రాజకీయాలకు పావుగా మారిపోయారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారు.
* నాలుగు నెలల పాటు జైల్లోనే..
దాదాపు జైల్లో నాలుగు నెలల పాటు గడిపిన వల్లభనేని వంశీ పూర్తిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy ) కలుసుకున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అవుతారని అంతా భావించారు. అయితే కేవలం అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని.. రాజకీయంగా కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంత మాత్రం రాజకీయాలు సేఫ్ కాదని ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తున్నట్లు సమాచారం. గత మాదిరిగా వ్యాపారాలు చేసుకోవడం ఉత్తమమని.. కుల పెద్దలతో పాటు సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వల్లభనేని వంశీకి విదేశాల్లో మంచి సర్కిల్ ఉంది. 2024 ఎన్నికలకు ముందే ఆయన అమెరికాకు వెళ్లిపోతారని కూడా ప్రచారం నడిచింది. ఇప్పుడు కూడా సన్నిహితులతో పాటు కుటుంబ సభ్యులు రాజకీయాలు వద్దని చెబుతున్నట్లు సమాచారం. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వల్లభనేని వంశీని గన్నవరం ఇన్చార్జిగా కొనసాగిస్తోంది. మరి వల్లభనేని వంశీ ఇన్చార్జిగా కొనసాగుతారా? రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అన్నది అతి త్వరలో తేలనుంది. చూడాలి.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?