Uttarandhra YCP : వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యులు ఎవరు? కురసాల కన్నబాబా? లేకుంటే బొత్స సత్యనారాయణా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. విజయసాయిరెడ్డి స్థానంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయనను ఉత్తరాంధ్ర నేతలు పెద్దగా లెక్క చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ డామినేట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ఒక ప్రచారం అయితే మాత్రం ఉంది. కనీసం కన్నబాబు మూడు జిల్లాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించే స్థితిలో లేరని కూడా తెలుస్తోంది.
Also Read : ఉత్తరాంధ్రలో వైసీపీకి డేంజర్ బెల్స్
* ఉత్తరాంధ్రలో పట్టున్న నేత..
బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) విజయనగరం జిల్లాకు చెందిన నేత. అయినా సరే మూడు జిల్లాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడు. అనూహ్యంగా విశాఖలో సైతం ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అప్పటినుంచి బొత్స మరింత విశాఖపై పట్టు సాధించారు. ఎన్నికల అనంతరం.. జగన్మోహన్ రెడ్డి అయితే విశాఖ స్థానిక సంస్థల నుంచి బొత్సతో పోటీ చేయించారు. బొత్స సీనియర్ నేత కావడంతో అధికారపక్షం వెనక్కి తగ్గింది. అందుకే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయ్యారు బొత్స. ఏకంగా శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా దక్కుతుండడంతో సరైన గౌరవం పొందుతున్నారు బొత్స.
* పదవి ఆశించి..
ప్రస్తుతం బొత్స ఉభయ గోదావరి( combined Godavari district) జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలను కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా కురసాల కన్నబాబును తెరపైకి తెచ్చారు. దీంతో బొత్స అయిష్టంగానే దీనికి ఒప్పుకున్నారు. అయితే కురసాల కన్నబాబుకు ఉత్తరాంధ్ర నాయకులు పెద్దగా సహకరించడం లేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి పార్టీకి పెద్ద దిక్కులుగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ సోదరులు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు ఫుల్ సైలెంట్ పాటిస్తున్నారు. కన్నబాబు నియామకం తర్వాత కూడా ఆయనను జిల్లాకు పెద్దగా ఆహ్వానించిన దాఖలాలు లేవు. విశాఖలో మాజీ మంత్రులు ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సైతం పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు. అయితే బొత్స ఆదేశాలతోనే వీరంతా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
* బొత్స హవా..
ప్రస్తుతం ఉత్తరాంధ్రలో బొత్స హవా నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నేతగా కూడా నియమించారు. అందుకే ఆయన చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో తాజా మాజీ మంత్రులంతా సైలెంట్ అయ్యారు. దీంతో సీనియర్ నేతగా ఉన్న బొత్స అన్ని తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ క్యాడర్ సైతం ఆయన ఆదేశాలను పాటిస్తోంది. బొత్సకు ఎనలేని గౌరవం దక్కుతోంది. అయితే ఈ క్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు సైతం.. తన ఉత్సాహాన్ని తగ్గించుకుంటున్నారు.
Also Read : సీనియర్ల రాజకీయ సన్యాసం.. ఉత్తరాంధ్రలో వైసీపీకి కష్టకాలం!