Uttarandhra YCP
Uttarandhra YCP: ఉత్తరాంధ్ర వైసీపీలో సీనియర్ నేతలు ఎదురీదుతున్నారు. సొంత పార్టీ శ్రేణుల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. దీంతో గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలు సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలకు గాను.. వైసిపి 28 స్థానాల్లో విజయం సాధించింది. టిడిపి ఆరు స్థానాలకు పరిమితమైంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయిలో ఫలితాలు అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కీలక నియోజకవర్గాల్లో అసమ్మతి తారస్థాయిలో బయటపడుతోంది. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆత్మీయ సమావేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖం చాటేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేతలు వ్యతిరేకించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అవినీతిపై సొంత పార్టీ నేతలే ఎండగడుతున్నారు. పరిస్థితులు చూస్తుంటే వైసీపీకి ప్రతికూల ఫలితాలు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతలు అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేత సువ్వారి గాంధీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువర్ణ, మాజీ ఎంపీపీ దివ్య తమ్మినేని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా బాట పట్టారు. కొత్తకోట బ్రదర్స్ తో పాటు చింతాడ రవికుమార్ వర్గీల సైతం తమ్మినేని నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. పలాసలో సైతం మంత్రి సీదిరి అప్పలరాజు అభ్యర్థిత్వాన్ని దువ్వాడ శ్రీకాంత్ వ్యతిరేకించారు. కాలింగ సామాజిక వర్గ నాయకులకు వేధింపులకు గురిచేయడం వంటి వాటిపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కాలింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ హేంబాబు చౌదరి పార్టీని వీడారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు.ఇచ్చాపురంలో జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిత్వాన్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. పాతపట్నంలో రెడ్డి శాంతికి టికెట్ ఇవ్వడం పై ఐదు మండలాల పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఎచ్చెర్ల లో గొర్లె కిరణ్ కుమార్ కు సైతం సొంత పార్టీ శ్రేణులే టికెట్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పార్టీ శ్రేణులను, అసంతృప్త నాయకులను బుజ్జగించేందుకు వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు.
విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బీసీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా పత్రికా సమావేశాలు నిర్వహించి కోలగట్ల అవినీతిపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముడుపులు ఇవ్వనిదే కోలగట్ల పనిచేయరని.. ఆయనను మార్చుకుంటే పార్టీ సర్వనాశనం అవుతుందని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అటు శృంగవరపుకోట నియోజకవర్గంలో సైతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గం ఇప్పటికే టిడిపిలో చేరింది. దీంతో అక్కడ వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
విశాఖ నగరంలో పార్టీ పరిస్థితి మరింత తీసికట్టుగా మారుతోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ కు గాజువాక టికెట్ కేటాయించారు. కానీ అప్పటికే అక్కడ ఇద్దరు అభ్యర్థులను మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు దేవాన్ రెడ్డి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన తొలగించి ఉరుకూటి చందును ఇన్చార్జిగా నియమించారు. ఈ విషయంలో గుడివాడ అమర్నాథ్ చొరవ తీసుకున్నారు. కానీ అమర్నాథ్ కు సర్దుబాటు చేసేందుకు అదే ఉరుకూటి చందును తొలగించాల్సి వచ్చింది. దీంతో అటు తిప్పల నాగిరెడ్డి, ఇటు ఊరుకూటి చందు పార్టీకి సహకరించని దుస్థితి. దీంతో గాజువాకలో గుడివాడ అమర్నాథ్కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న సంకేతాలు వస్తున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కొందరు కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతమ్మరాజు సుధాకర్ పార్టీకి దూరమయ్యారు. టిడిపిలో చేరిపోయారు. తూర్పు నియోజకవర్గంలో ఎంవివి సత్యనారాయణను ఎక్కువమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అక్కడ కీలక నాయకుడుగా ఉన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు వ్యవహార శైలి పై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. మొత్తానికైతే ఉత్తరాంధ్రలో వైసిపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, ఉప సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. దీంతో ఫలితాలపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Danger bells for ycp in uttarandhra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com