Ration cards : ఏపీ ప్రభుత్వం ( AP government )గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొద్దిరోజులుగా లక్షలాదిమంది రేషన్ కోర్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారితో పాటుగా ఇప్పటికే బియ్యం కార్డులు ఉన్నవారికి కూడా జూన్లో క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త కార్డులు జారీచేస్తారు. గ్రామ/ వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులకు సంబంధించిన సేవలు పొందవచ్చు. వచ్చే సోమవారం నుంచి వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
Also Read : ఏపీలో రేషన్ కార్డుల పై బిగ్ అప్డేట్.. నేటి నుంచి దరఖాస్తులు!
* వారికి సైతం బియ్యం కార్డులు..
మరోవైపు ప్రభుత్వం ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటరి మహిళలు, ఆశ్రమాల్లో ఉండే వారికి కూడా బియ్యం కార్డులు అందించనుంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు( Outsourcing employees) బియ్యం కార్డు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఒక్కటి మాత్రమే కాదు.. మరికొన్ని సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. సచివాలయాల్లో రైస్ కార్డులకు సంబంధించి ఏడు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు. కొత్త బియ్యం కార్డు, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం, కార్డును విభజించడం, ఉన్న సభ్యుల పేర్లను తొలగించడం, కార్డును తిరిగి ఇవ్వడం, చిరునామా మార్పులు చేసుకోవడం, ఆధార్ కార్డు వివరాల్లో తప్పులు సరిదిద్దడం వంటి సేవలను సచివాలయాల్లో పొందవచ్చు. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
* నెల రోజుల పాటు ప్రక్రియ
నెలరోజులపాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది ఏపీ ప్రభుత్వం. వాటిని పరిశీలించిన తర్వాత అర్హులకు రేషన్ కార్డులు( ration cards ) అందిస్తారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తప్పుడు చిరునామాలు, పేర్లతో ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మార్పులు చేసుకునే అవకాశం రావడంతో వారికి ఊరట దక్కింది. పాత రేషన్ కార్డుల లబ్ధిదారులకు జూన్ లో క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త కార్డులు ఇస్తారు. పాత బియ్యం కార్డు స్థానంలో ప్రభుత్వం కొత్తగా ఈ క్యూఆర్ కోడ్ తో ఉన్న స్మార్ట్ కార్డులను జారీ చేయనుంది. గత ప్రభుత్వం లో మాదిరిగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫోటోలు ఉండవు. కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. అడ్రస్ సైతం మార్చుకోవచ్చు. కార్డుపై కుటుంబ యజమాని పేరు, ఫోటో, కుటుంబ సభ్యుల సంఖ్య మాత్రమే ఉంటుంది. కార్డులో పెద్దగా బియ్యం కార్డు నెంబరు, రేషన్ షాప్ ఐడి, క్యూఆర్ కోడ్ కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, వారు పుట్టిన తేదీ, వయస్సు, బంధుత్వం, శాశ్వత చిరునామా మాత్రమే ఉంటాయి.
Also Read : అర్హులకు శుభవార్త.. త్వరలో కొత్త రేషన్ కార్డులు