Jagan : వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మునుపటి దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు. ఇటువంటి సమయంలో పార్టీని కాపాడుకునేందుకు సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. తాడో పేడో అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం పెంపొందించడం ఒకవైపు.. పార్టీని బలోపేతం చేయడం ఇంకోవైపు.. 2029 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడం మరోవైపు అన్నట్టు.. జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా ఆయన వ్యూహాలు ఉన్నాయి. తాజాగా పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలను చూసిన తర్వాత తాను మారక తప్పదని వ్యాఖ్యానించారు. తనకోసం మద్దతుగా నిలిచిన వారిని వేధిస్తున్నారని.. అటువంటి వారికి అండగా నిలబడతానని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పనిలో పనిగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది ప్లీనరీ నిర్వహణతో పాటు పాదయాత్ర 2.0 ఉంటుందని ప్రకటించారు.
Also Read : జగన్ ‘వర్క్ ఫ్రం బెంగళూరు’.. టైటిల్ అదుర్స్!
* గ్రామస్థాయి నుంచి బలోపేతం..
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). వైయస్సార్ కాంగ్రెస్ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. 2029లో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసులకు భయపడితే రాజకీయం చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు ఆదేశించారు. 2027 నుంచి పాదయాత్ర 2.0 ప్రారంభిస్తానని కూడా ప్రకటించారు. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలని ఆదేశించారు. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలని కూడా సూచించారు.
* అప్పటి తరహా మాదిరిగా..
2019 ఎన్నికలకు ముందు ఉన్న వాతావరణం క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఒకవైపు పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను వైయస్సార్ కాంగ్రెస్ వైపు టర్న్ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* మిశ్రమ స్పందన..
2017లో పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉండేది. క్షేత్రస్థాయిలో బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ నేతలు నమ్మకం కోల్పోయారు. కేవలం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను( welfare schemes) నమ్ముకున్నారు. కానీ కూటమి మాత్రం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన పై దృష్టి పెట్టింది. 2027 నాటికి ఈ మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయి. అటువంటి తరుణంలో పాదయాత్ర చేస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.
Also Read : అమరావతి విషయంలో చంద్రబాబును భయపెడుతున్న ఆంధ్రజ్యోతి ఆర్కే!