Unemployment Benefit: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలో సైతం ఈ పథకాలను చేర్చి అమలు చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఇప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టుపై కూడా ఫోకస్ పెట్టారు. ఇటువంటి తరుణంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు. అన్నదాత సుఖీభవ అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ప్రారంభించనున్నారు. ఇక నిరుద్యోగులకు సంబంధించి నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ చర్చలు ప్రారంభించారు. దీంతో నిరుద్యోగ భృతి పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.
* గతంలోనే అమలు..
వాస్తవానికి నిరుద్యోగ భృతి పథకాన్ని టిడిపి ప్రభుత్వం( TDP government) గతంలో అమలు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ సమయంలో వేయి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందించగలిగింది. అయితే అప్పట్లో ఈ పథకం సరిగ్గా అమలు కాలేదు. చాలా రకాల విమర్శలు కూడా వచ్చాయి. దీనిని తాజాగా పక్కాగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఇటీవల తల్లికి వందనం పథకం అమలు విషయంలో లోకేష్ బాగా పని చేశారన్న ప్రశంసలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
* అధికారులతో చర్చలు..
పథకం అమలు చేయాలంటే భారీగా డబ్బులు అవసరం. అసలు ఏపీలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఉద్యోగ ఉపాధికి దూరంగా ఉన్నది ఎంతమంది? వారి ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణికలు ఏమిటి? అన్నదానిపై అధికారులతో లోకేష్( Nara Lokesh ) కీలక చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో సైతం ఈ పథకంపై లోకేష్ చర్చించారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. ఇప్పటికే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్, రేషన్ వంటి వాటికి సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో ఆదాయం కూడా సమకూరే అవకాశాలు ఉన్నాయి. అందుకే కీలకమైన నిరుద్యోగ భృతి పథకానికి కూటమి సర్కార్ సిద్ధపడినట్లు తెలుస్తోంది.
* అర్హతలివే..
మరోవైపు నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం( Alliance government ) కసరత్తు చేస్తోంది. ఇటువంటి సమయంలోనే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు పై సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. దీని ప్రకారం నిరుద్యోగ భృతిని నిరుద్యోగులందరికీ ఇవ్వరు. చదువు పూర్తయి.. ఉద్యోగం లేని వారికి మాత్రమే ఇస్తారు. ఏపీలో నివాసం ఉండేవారు అర్హులు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి తప్పకుండా 10, ఇంటర్, డిప్లమో, ఐటిఐ లేదా డిగ్రీ పాసై ఉండాలి. నిరుద్యోగి ఇప్పటికే ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటే మాత్రం నిరుద్యోగ భృతికి అనర్హులు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఈ పథకం అందదు. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న నిరుద్యోగులకు సైతం పథకం వర్తించదని తెలుస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు.