https://oktelugu.com/

AP Rains: ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీ ని వర్షాలు వీడడం లేదు. గత నెల రోజులుగా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : December 19, 2024 / 08:25 AM IST

    AP Rains

    Follow us on

    AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు వస్తోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించనుంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్ళనుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో ఈరోజు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇంకో వైపు ఏపీలో చలి కుమ్మేస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో బలపడింది ఈ అల్పపీడనం. వచ్చే 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తర దిశగా ఏపీ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాలోని కొన్ని ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

    * ఉత్తరాంధ్రకు వర్ష సూచన
    రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో శుక్రవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం సముద్రం అలజడిగా ఉంది. మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. చాలా జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. చాలాచోట్ల సముద్రం ఒడ్డు కోతకు గురైంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి.

    * పెరిగిన చలి తీవ్రత
    మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చలి వణికిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి చలి తీవ్రత కనిపిస్తోంది. ఉదయం 10 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు. పొగ మంచుతో వాహనదారులకు అసౌకర్యం తప్పడం లేదు.