https://oktelugu.com/

Paritala Ravindra: 18 ఏళ్ల తర్వాత.. పరిటాల రవి హత్య నిందితులకు బెయిల్

2005లో దారుణంగా హత్యకు గురయ్యారు మాజీ మంత్రి పరిటాల రవి. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ సమావేశానికి హాజరై వస్తుండగా పరిటాల రవిని హత్య చేశారు ప్రత్యర్ధులు. అప్పటినుంచి జైల్లో ఉన్న నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 19, 2024 / 08:39 AM IST

    Paritala Ravindra

    Follow us on

    Paritala Ravindra: ఉమ్మడి రాష్ట్రంలో పరిటాల రవి సుపరిచితులు. ఆయన అంటే తెలియని వారు ఉండరు. టిడిపి ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉన్న పరిటాల రవిని 2005లో దారుణంగా హత్య చేశారు. ఓ సమావేశానికి హాజరై వస్తుండగా దుండగులు కాల్చి చంపారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి తాజాగా బెయిల్ లభించింది. ఏపీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పరిటాల రవి హత్య కేసులో ఏ3గా ఉన్న పండుగ నారాయణరెడ్డి, ఏ 4 రేఖమయ్య, ఏ 5 భజన రంగనాయకులు, ఏ6 వడ్డే కొండ, ఏ8 ఓబిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. అలాగే నిందితులు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించింది. ఆరోజు ఉదయం 11 గంటలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. చట్టానికి లోబడి ఉండాలని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

    * ప్రతిదీ సంచలనమే
    2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2005లో పరిటాల రవి హత్య జరిగింది. నిందితులు గత 18 సంవత్సరాలుగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ లభించకపోవడంతో కింది కోర్టు తీర్పు పై హైకోర్టులో అపీల్ చేశారు. బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పరిటాల రవి హత్య కేసులో మొద్దు శీను అనే షూటర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తన బావ సూరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే పరిటాల రవిని కాల్చానంటూ అప్పట్లో మొద్దు శీను మీడియా ముఖంగా ప్రకటించడం సంచలనంగా మారింది.

    * ప్రధాన నిందితులు ఇద్దరు హత్య
    పరిటాల హత్య కేసులో అరెస్ట్ అయిన మొద్దు శీను అలియాస్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డి 2008లో జైల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఓం ప్రకాష్ అనే ఖైదీ దారుణంగా హత్య చేశాడు. మొద్దు శీను నిద్రపోతున్న సమయంలో తలపై డంబెల్ తో బాది హత్య చేశాడు. నిందితుడు ఓం ప్రకాష్ జైల్లో ఉంటూ 2020లో అనారోగ్యంతో చనిపోయాడు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి సైతం హత్యకు గురయ్యారు. భాను కిరణ్ అనే వ్యక్తి మధ్యలో చెరువు సూరిని కాల్చి చంపాడు. పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు పంపారు. నెల రోజుల కిందటే మధ్యలో చెరువు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇప్పుడు పరిటాల రవి హత్య కేసులో నిందితులు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన మాత్రం అనంతపురంలో కనిపిస్తోంది.