Visakhapatnam: వారందరిది 19 నుంచి 22 ఏళ్ల వరకు వయసు ఉంటుంది.. అందరూ ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నారు. పైగా వారంతా ఉంటున్నది విశాఖపట్నంలో.. అలాంటి యువత బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకోక.. నడి బజార్లో రౌడీల్లాగా కొట్టుకున్నారు. పిడి గుద్దులు గుద్దుకున్నారు. ముష్టి ఘాతాలతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. అటు సమీపంలో ఉన్న వాళ్లకు ఆ దృశ్యాలను చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టింది. ఏం జరుగుతుందో అంతుపట్టక భయం కలిగింది..నూనూగు మీసాల యువకులు ఆ స్థాయిలో కొట్టుకోవడం సంచలనం కలిగించింది. నిజానికి వారేమీ బద్ధ శత్రువులు కాదు, వీధి రౌడీలు అంతకన్నా కాదు. కానీ వారికి మించే స్థాయిలో కొట్టుకున్నారు. రాసేందుకు వీలు లేని భాషలో తిట్టుకున్నారు.. నడిరోడ్డు మీద ఆ యువకులు చేసిన హంగామా వల్ల చుట్టుపక్కల వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొంతమంది ఆ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.
ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో..
ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం జిల్లాలో పేరుపొందిన కాలేజీలు ఉన్నాయి. విశాఖపట్నం నగరంలో ప్రపంచ స్థాయి కళాశాలలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. పలు కోర్సులలో ప్రవేశాలు పొంది తమ భావి జీవితానికి బాటలు పరుచుకుంటున్నారు ఇదే సమయంలో ఆ యువకులు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్లాష్ మాబ్ నిర్వహించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా వారంతా ఒకచోట చేరారు. విశాఖపట్నంలోని ప్రధాన రోడ్డును ఇందుకు ఎంచుకున్నారు. విద్యార్థులంతా వారి వారి కాలేజీల నుంచి భారీగా చేరుకున్నారు. ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు. ఇదే సమయంలో డీజే పాట ప్లే చేసి ఫ్లాష్ మాబ్ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదే సమయంలో ఆ విద్యార్థుల్లో చిన్నపాటి చర్చ పెద్ద గొడవకు దారితీసింది. దీంతో వారంతా పరస్పరం దాడులు చేసుకున్నారు. వారంతా ఎందుకు కొట్టుకుంటున్నారో చుట్టుపక్కల వాళ్లకు అంతు పట్టలేదు. గల్లాలు గల్లాలు పట్టుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. కొందరైతే రాయడానికి వీలు లేని భాషలో తిట్టుకున్నారు. ఇష్టానుసారం దాడులు చేసుకున్నారు. వారు కొట్టుకుంటున్న తీరు వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో రద్దీ వాతావరణం ఏర్పడింది.
తీవ్రంగా స్పందిస్తున్నారు
ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ” ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం పరువు తీశారు. అసలు మిమ్మల్ని ఫ్లాష్ మాబ్ నిర్వహించమని అడిగింది ఎవడు? ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రూపొందించిన కార్యక్రమం కాస్త అభాసుపాలైంది. ఇలా రోడ్డుమీద పడి కొట్టుకోవడంతో బీహార్ లాగా మారింది. ఇంతకుమించిన దరిద్రం ఇంకేం ఉంటుంది. ఇలాంటి అప్పుడు పోలీసులు ఎక్కడికి పోతారో అర్థం కాదు.. ఆ ఆవేశంలో ఆ యువకులు ఏదైనా చేయరానిది చేస్తే ఎవరు జవాబు దారి? కళాశాల యాజమాన్యాలు ఇలాంటి విషయాలను ఎందుకు పట్టించుకోవు? వారంతా విద్యార్థుల్లాగా లేరు.. వీధి రౌడీల్లాగా కొట్టుకుంటున్నారు. ఇప్పుడే ఇలా కొట్టుకుంటున్నారంటే.. కాలేజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వారి వ్యవహార శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివారు ప్రజల్లో చైతన్యం కలిగిస్తారంటే ఎలా నమ్మాలి? బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకుంటే బాగుంటుందని” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
విశాఖపట్నంలో నడిరోడ్డుపై రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులు. pic.twitter.com/ujyKm8CA4D
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2024