AP Political Survey: ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది.ఈ నేపథ్యంలో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి.ఒక్కో సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడిస్తోంది. ఇప్పటివరకు వెల్లడైన సర్వేల్లో అధిక శాతం వైసీపీకి అనుకూల ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు తాజాగా టీవీ9 భారత్ వర్ష్ తన ఒపీనియన్ పోల్ వివరాలను వెల్లడించింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఒపీనియన్ పోల్ నిర్వహించినట్లు సంబంధిత సంస్థ చెబుతోంది. పీపుల్స్ ఇన్ సైడ్, పోల్స్ ట్రాట్ వంటి సంస్థల సహకారంతో సర్వే పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చింది.దేశవ్యాప్తంగా బిజెపి హవా నడుస్తుండగా ఏపీలో మాత్రం.. మరోసారి వైసిపి విజయం దక్కించుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను.. 14 చోట్ల వైసిపి గెలుపు పొందుతుందని స్పష్టం చేసింది. మిగిలిన 11 నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకుంటుందని ప్రకటించింది. ఇందులో టిడిపి ఏడు, బిజెపి నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని కూడా తేల్చేసింది.
అయితే ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ వైసీపీ ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టగా.. టీవీ9 భారత వర్ష్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ మాత్రమే దాటుతుందని చెప్పడం విశేషం. వైసిపి సాధించే లోక్సభ స్థానాల ప్రాతిపదికన తీసుకుంటే 98 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశం ఉంది. అటు కూటమి స్థానాలను ప్రాతిపదికగా తీసుకుంటే 77 అసెంబ్లీ సీట్లు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే గతం కంటే విపక్షాలు బలపడినట్లు తెలుస్తోంది. అధికార పక్షం బలం క్రమేపి తగ్గినట్లు కనిపిస్తోంది.మొత్తానికైతే ఏపీలో హోరాహోరీ ఫైట్ ఉంటుందని టీవీ9 సర్వే తేల్చడం విశేషం.