YCP: వైసిపి ఆవిర్భావము నుంచి దళితులు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. 2014 ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీయే అధిక స్థానాలను గెలుచుకుంది. 2019లో మాత్రం దాదాపు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో వైసిపి ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలను మచ్చిక చేసుకోవడానికి చంద్రబాబు ఎంతలా ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. దాదాపు ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇప్పుడు కూడా ఎస్సీలను ఆకట్టుకునేందుకు జగన్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వాస్తవానికి ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి బలమైన వర్గాలుగా ఉండేవారు.ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చేవారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీలో ఎస్సీలను ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఒక పన్నాగం పన్నారు. దళితుల్లో చీలిక తెచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి మద్దతు ఇచ్చారు. దీంతో ఎస్సీల్లో మాదిగలు టిడిపికి అనుకూలంగా మారారు. మాలలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు.కానీ 2014 రాష్ట్ర విభజన తరువాత ఏపీలో మాదిగల ప్రాబల్యం తగ్గిపోయింది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో మాదిగల సంఖ్య తక్కువ. అందుకే దళితుల్లో తెలుగుదేశం పార్టీకి క్రమేపి పట్టు తగ్గింది. అయితే కాంగ్రెస్కు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన మాలలు వైసిపికి టర్న్ అయ్యారు. ఆ పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలిచారు. అటు ఏపీలో మాదిగల కంటే మాలల సంఖ్య అధికం. దీంతో వైసిపి తో పాటు టిడిపి సైతం మాలలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది.
అయితే తాజా ఎన్నికల్లో మాలల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. నిన్న వైసీపీ ప్రకటించిన జాబితాలో మాలలకు 19 స్థానాలు, మాదిగలకు పది స్థానాలు కేటాయించారు. అయితే ఇంకా కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. మరి వారు మాలలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? మాదిగలకు ఎన్ని సీట్లు ఇస్తారు? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే తమకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన మాలలకు వైసీపీ హై కమాండ్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది అన్నది వాస్తవం.