YCP Final List: వైసిపి పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేసింది. కొన్ని కుటుంబాలకు పెద్దపీట వేసింది. ఒకే కుటుంబం నుంచి తండ్రీ కొడుకులకు, భార్యాభర్తలకు, అన్నదమ్ములకుచోటు కల్పించింది.కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు ఛాన్స్ ఇచ్చింది. చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి సైతం టిక్కెట్లు ఇచ్చి గౌరవించింది. చాలా సందర్భాల్లో చాలా మంది సీనియర్ నాయకులు తమ వారసులకు టిక్కెట్ ఇవ్వాలని జగన్ ను కోరారు. కానీ అందుకు జగన్ సమ్మతించలేదు.కానీ తుది జాబితాలో చాలామంది వారసులకు ఛాన్స్ ఇచ్చారు.
మచిలీపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న పేర్ని నాని బదులు ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు చాన్స్ ఇచ్చారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించారు. గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే షేక్ ముస్తఫా కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు, జీడీ నెల్లూరు నుంచి డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోడలు తనుజారాణికి అరకు ఎంపీ స్థానాన్ని కట్టబెట్టారు. టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కూడా ఛాన్స్ ఇచ్చారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య రాజ్యలక్ష్మి కి ఈసారి సీటు ఇచ్చారు.
బొత్స కుటుంబంలో నలుగురికి టికెట్లు దక్కాయి.బొత్స సత్యనారాయణ చీపురుపల్లి అసెంబ్లీ స్థానం,ఆయన సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం అసెంబ్లీ స్థానం, మరో సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడుకు నెల్లిమర్ల అసెంబ్లీ సీటును, బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మికి విశాఖపట్నం స్థానానికి టికెట్ కేటాయించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంలో ముగ్గురికి సీట్లు దక్కాయి. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె నుంచి, కుమారుడు మిథున్ రెడ్డికి రాజంపేట లోక్సభ స్థానం అభ్యర్థిగా ప్రకటించారు. శ్రీకాకుళంలో సోదరులైన ధర్మాన కృష్ణ దాస్, ప్రసాద్ రావు లకు టిక్కెట్ ఇచ్చారు.ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్, సతీష్ సోదరులకు,వై. బాలనాగిరెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, వై. సాయి ప్రసాద్ రెడ్డి సోదరులకు సైతం టికెట్లు కట్టబెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు లోక్సభ స్థానాన్ని కేటాయించగా.. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ సీటును ప్రకటించారు. కారుమూరి నాగేశ్వరరావు తణుకు అసెంబ్లీ స్థానం, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు లోక్సభ సీటును దక్కించుకున్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయ్ గురించి పోటీ చేస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన బాబాయ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం నుంచి బరిలో దిగుతున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురుకి వైసిపి చాన్స్ ఇవ్వడం విశేషం.
ఇక ఎన్నికల ముంగిట పార్టీలో చేరిన వారికి సైతం టిక్కెట్లు ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి అదే స్థానాన్ని కట్టబెట్టారు. ఇటీవల పార్టీలో చేరిన నల్లగట్ల స్వామిదాస్కు తిరువూరు అసెంబ్లీ సీటును కేటాయించారు. గొల్లపల్లి సూర్యారావుకు రాజోలులో చాన్స్ ఇచ్చారు. జొలదరాశి శాంత ఇటీవలే పార్టీలో చేరారు. ఆమెకు హిందూపురం లోక్సభ సీటు కేటాయించారు. మొత్తానికైతే వైసీపీ అభ్యర్థుల ప్రకటన పెద్ద ప్రహసంలా మారింది.