TTD Laddu Case : ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే చాలామంది అరెస్టు అయ్యారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడు తదుపరి అరెస్ట్ ఎవరిదా? అన్న చర్చ నడుస్తోంది. దీంతో అందరి చూపు ఆ కీలక నేత వైపు ఉంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే తిరుమల లడ్డూ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రముఖులతో పాటు అప్పట్లో పాలనా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లడ్డూ కేసులో నలుగురిని అరెస్టు చేశారు సిట్ అధికారులు… ఇప్పుడు అప్పట్లో కీలక స్థానాల్లో నిలిచిన ముగ్గురు మాజీలపై ఫోకస్ చేశారు. వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయించారు. అయితే వారు విచారణ నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అందుకే లుక్ అవుట్ నోటీసులు జారీకి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : జవాన్ కు కష్టం.. 24 గంటల్లో పరిష్కరించిన నారా లోకేష్!
* అప్పట్లో పెను వివాదం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిపారు అన్న ఆరోపణలు వచ్చాయి. సీఎం చంద్రబాబు బాహటంగా ఈ విషయం బయట పెట్టడంతో పెను వివాదానికి దారితీసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ అనుమానాలు బలపడ్డాయి. ఇటువంటి తరుణంలో నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన సిట్ కాకుండా.. సిబిఐతో దర్యాప్తు చేయాలని కోరింది. ఈ తరుణంలో కోర్టు భిన్నంగా స్పందించింది. సిబిఐ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత కొద్ది నెలలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. అయితే సంచలన అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది.
* తిరుపతి కేంద్రంగా విచారణ.. సుప్రీంకోర్టు( Supreme Court) ఆదేశాలతో ఏర్పాటైన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి కేంద్రంగా విచారణ చేపడుతోంది. నెయ్యి టెండర్ల నుంచి సరఫరా చేసిన సంస్థల వరకు క్షుణ్ణంగా పరిశీలన చేసింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో స్వాధాలు చేసింది. వీటికి బాధ్యులను చేస్తూ నలుగురిని అరెస్టు చేసింది. అయితే ఈ కేసు విచారణలో మరో కీలక నిర్ణయం దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం అడుగులు వేస్తోంది. మొదటి ఛార్జ్ షీట్ వెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ పిఎ ఒకరికి నోటీసులు ఇచ్చింది. గత నాలుగు రోజులుగా ఆయనను విచారణ చేసింది. గతంలో పాలనాపరంగా దిశా నిర్దేశం చేసే హోదాలో పని చేసిన ఇద్దరు మాజీ ప్రముఖులతో పాటు మరో కీలక అధికారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
* వైసీపీలో ఆందోళన..
అయితే మద్యం కుంభకోణం కేసులో ఓవైపు వైసీపీ నేతలు ఇరుక్కుపోవడంతో ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళన ఉంది. ఇప్పుడు లడ్డూ కేసులో సిట్ వేగంగా పావులు కదుపుతుండడంతో మరికొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీ హయాంలో తిరుమలలో అపచారాలు జరిగాయని అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలా రకాలుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు లడ్డూ వివాదంలో వైసీపీ నేతలు అరెస్ట్ అయితే ఆ పార్టీకి ఇబ్బందికరమే.