https://oktelugu.com/

Amaravathi capital : నెల రోజుల్లో అమరావతి యధా స్థానానికి.. కీలక పరిణామం!

ఐదేళ్ల కిందట అమరావతిని చూడాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే. అందుకు సంబంధించి కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అడవిని తొలగించే పనిలో పడింది ప్రభుత్వం.

Written By:
  • Dharma
  • , Updated On : August 7, 2024 / 01:45 PM IST
    Follow us on

    Amaravathi capital : అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతిని యధాస్థానానికి తీసుకొచ్చి.. పనులను పున ప్రారంభించేలా చర్యలు చేపడుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పావులు కదిపింది. జూన్ 4న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత రోజు నుంచే అమరావతి రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. కీలక విభాగాలు, రహదారులు, నిర్మాణాల వద్ద ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ళ పొదలను తొలగించారు. వెలగని విద్యుత్తు లైట్లను తీసి.. వెలిగించే ప్రయత్నం చేశారు. సీఎంతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అమరావతి దేదీప్యమానంగా వెలుగుల కాంతిలో కనిపించింది. అయితే అప్పట్లో జరిగింది తాత్కాలిక జంగిల్ క్లియరెన్స్ పనులు మాత్రమేనని తెలుస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. కనీస నిర్వహణ కూడా కరువైంది.దీంతో అమరావతికి సేకరించిన 58 వేల ఎకరాల భూముల్లో.. తుమ్మ చెట్లు, ముళ్ళ పొదలు పేరుకుపోయాయి. దీంతో అది చిట్టడివిలా మారిపోయింది. మరోవైపు కీలక నిర్మాణాలు నీటిమడుగులో ఉండిపోయాయి. శాశ్వత సచివాలయం తో పాటు కీలక విభాగాధిపతుల భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయాయి. వాటిలో నీరు చేరింది. దీంతో ఆ నిర్మాణాలు పనికి వస్తాయా? లేదా? అన్నది ఐఐటి నిపుణులు తేల్చనున్నారు. ఇటీవల అమరావతిని సందర్శించారు. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. ఇంతలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు నెలల్లో అమరావతిని యధా స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

    * రూ. 36.5 కోట్లతో పనులు
    అమరావతిలో శాశ్వత జంగిల్ క్లియరెన్స్ పనులకు గాను ప్రభుత్వం రూ. 36.5 కోట్లతో టెండర్లను పిలవాల్సి వచ్చింది. ఇటీవల టెండర్లు కూడా ఖరారు చేశారు.ఈరోజు పనులు ప్రారంభించారు.అమరావతి రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ పనులను ప్రారంభించారు. మొత్తం 58,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు,ముళ్ళ కంపలను నెల రోజుల్లోగా తొలగించేలా పనులు జరపనున్నారు. అప్పుడే రైతులకు తమ ఫ్లాట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    * నిర్మాణాలు కనుమరుగు
    గత ఐదు సంవత్సరాలుగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని అలాగే విడిచిపెట్టడంతో తుమ్మ చెట్లు పెరిగిపోయాయి. రైతులకు కేటాయించిన ఫ్లాట్లు సైతం గుర్తించలేని పరిస్థితికి చేరుకుంది. రాజధాని ప్రాంతంలో వేసిన సిసి రహదారులు కూడా కనిపించడం లేదు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించాలంటే దానిని ముందుగా యధా స్థానానికి తీసుకురావాలి.ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తోంది.కేవలం జంగిల్ క్లియరెన్స్ పనులకే దాదాపు 37 కోట్ల రూపాయలు కేటాయించింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. నెల రోజుల్లో ఈ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

    * డివిజన్ల వారీగా పనులు
    అమరావతి రాజధాని ప్రాంతాన్ని జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే.వాటిని 99 డివిజన్లుగా విభజించి పనులు ఒకేసారి చేపట్టనున్నారు.వాస్తవానికి అమరావతి రాజధాని అనేది నవ నగరాల ప్రతిపాదన ప్రాంతం. వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 29 పంచాయతీలకు సంబంధించి భూమిని అప్పట్లో సేకరించారు. ఐదు సంవత్సరాలు పాటు అలానే వదిలేయడంతో ఆ ప్రాంతం అడవిలా మారింది. దానిని యధా స్థానానికి తీసుకొచ్చేందుకే భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.