YS Sunitha : ఏపీ హోం మినిస్టర్ అనితతో వైఎస్ సునీత.. జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?

వివేకానంద రెడ్డి హత్య కేసు పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. శాసనసభ వేదికగా సీఎం చంద్రబాబు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత.. హోం మంత్రి వంగలపూడి అనితను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written By: Dharma, Updated On : August 7, 2024 1:39 pm
Follow us on

YS Sunitha : వైయస్ వివేకానంద రెడ్డి హత్య దర్యాప్తు మందగించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు సునీత ప్రత్యేకంగా వచ్చి హోం మంత్రిని కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని వివరించారు. వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచిన విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం.వారిపై కూడా చర్యలు తీసుకోవాలని.. కేసును నీరుగాచేలా స్థానిక పోలీసులు సైతం వ్యవహరించాలని హోం మంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. సిబిఐ అధికారులపై సైతం స్థానిక పోలీసులు బెదిరింపులకు దిగిన వైనాన్ని ప్రస్తావించారు. దీనిపై హోంమంత్రి సునీత సానుకూలంగా స్పందించారు. వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు కొనసాగుతుందని.. నిందితులకు చట్టపరంగా కఠినంగా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగింది. మార్చి 15న సొంత ఇంట్లోనే వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత సాక్షి మీడియాలో గుండెపోటుగా చెప్పుకొచ్చారు. తరువాత హత్యగా మార్చారు. దీనిపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో జగన్ రాజకీయ సానుభూతి పొందారు. చంద్రబాబు సర్కార్ పై దుష్ప్రచారం చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షిలో పతాక శీర్షికన కథనాన్ని ప్రచురించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు కావాలన్న జగన్.. అధికారంలోకి వచ్చాక అవసరం లేదని భావించారు. అప్పుడే ఎంటర్ అయ్యారు వైఎస్ సునీత. సిబిఐ దర్యాప్తు కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏకంగా కోర్టుకు వెళ్లి దర్యాప్తు కొనసాగేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. అప్పటినుంచి అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చారు.

*:వెనుకడుగు వేయలేదు
నిందితులను అప్పటి సీఎం జగన్ కొమ్ము కాస్తున్నట్లు కూడా ఆరోపణలు చేశారు. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా.. వైఎస్ సునీత మాత్రం వెనుకడుగు వేయలేదు. ఈ ఎన్నికల్లో మరోసారి జగన్ అధికారంలోకి వస్తే.. వివేకానంద రెడ్డి హత్య కేసు మరుగున పడిపోతుందని భావించారు. అందుకే జగన్ సర్కార్ మరోసారి అధికారంలోకి రాకూడదని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా అడుగులు వేశారు. ఇప్పుడు జగన్ అధికారంలో నుంచి దిగిపోవడంతో కేసులో పురోగతి ఉంటుందని ఆశిస్తున్నారు.

* ముందుకెళ్లని విచారణ
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతున్నా.. కేసు విచారణ ఆశించిన స్థాయిలో ముందుకెళ్లలేదు. ఈ తరుణంలోనే ఆమె హోం మంత్రి అనితను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివేకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే తేల్చి చెప్పారు. రాజకీయాల కోసం వివేకానంద రెడ్డిని హత్య చేసి.. ఆ నిందను తనపై వేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిందితులను అరెస్టు చేసి.. నిజాలను నిగ్గు తేల్చుతామని కూడా ప్రకటించారు.ఇటీవల శాసనసభ వేదికగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో త్వరలో అరెస్టులు ఉంటాయని కూడా తేల్చి చెప్పారు.

* భయపడుతున్న జగన్
అధికారం కోల్పోయిన వెంటనే జగన్ భయపడింది రెండింటికే. ఒకటి తనపై ఉన్న పాత అక్రమాస్తుల కేసులు. రెండు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు. అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు కచ్చితంగా అధికార పక్షానికి ఒక వరంగా మారనుంది. ఈ కేసులో తనకు ఇబ్బందులు తప్పవని కూడా జగన్ కు తెలుసు. ఈ విషయంలో చంద్రబాబు సర్కార్ ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కొద్ది రోజుల కిందటే శాసనసభ వేదికగా వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు సునీత వెళ్లి హోం మంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.