Pawan – TDP Seniors : పవన్ పై టీడీపీ సీనియర్ల నమ్మకం.. అసలు కారణం ఇదీ

పవన్ ఎంత దూకుడు అయినా సీనియర్ నాయకుల విషయంలో చాలా గౌరవంగా ఉంటారు. హుందాగా వ్యవహరిస్తారు. అందుకే టీడీపీలో సీనియర్లు ఈసారి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. తమ సీటంటే పవన్ సైతం జనసేన కోసం పెద్దగా పట్టుబట్టరని నమ్మకంగా ఉన్నారు.

Written By: Dharma, Updated On : June 23, 2023 12:08 pm
Follow us on

Pawan – TDP  Seniors : జనసేనతో పొత్తుకు టీడీపీ సీనియర్లు బలంగా కోరుకుంటున్నారా? పొత్తు ఉంటేనే సునాయాస విజయం సాధ్యమని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీలోని సీనియర్ల వైఖరి అలానే ఉంది. ఈ ఎన్నికల్లో చాలామంది సీనియర్లు బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి గౌరప్రదమైన రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. తరువాత వారసులకు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. అటువంటి వారంతా పొత్తు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే వారాహి యాత్ర తరువాత పవన్ లో మార్పు వారిని కలవరపెడుతోంది.

ఎప్పుడైతే పవన్ విడిగా పోటీచేస్తాను.. నాకు ఒక చాన్సివ్వండి.. జనసేనను మాత్రం గెలిపించండి అంటూ ప్రజలకు పిలుపునివ్వడంతో టీడీపీలోని సీనియర్లు షాక్ కు గురయ్యారు. డామిట్ కథ అడ్డం తిరిగిందంటూ తెగ బాధపడిపోయారు. కానీ ఎక్కడా బయటపడలేదు. జూనియర్లు మాత్రం ఓకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మీడియా ముందుకు వచ్చి రంకెలు వేశారు. కొందరైతే టీవీ డిబేట్లలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ఏం బలం ఉందని ఒంటరిగా వెళతారని ప్రశ్నించారు. వైసీపీకి లబ్ధి చేకూర్చడానికేనంటూ కామెంట్స్ చేశారు.

అటు ఎల్లోమీడియా సైతం సెడన్ గా స్ట్రాటజీ మార్చింది. వారాహి యాత్ర ప్రారంభంలో లైవ్ లు, నిరంత వార్తలతో హడావుడి చేసింది. ఎప్పుడైతే విడిగా పోటీ అన్న మాట వచ్చిందో లైవ్ లు కట్ చేశారు. వార్తల నిడివి తగ్గించారు. జగన్ తో పాటు వైసీపీ నేతలపై పవన్ చేసిన ఆరోపణలకే ప్రయారిటీ ఇచ్చారు. అయితే మళ్లీ ఇంటర్వ్యూల్లో తప్పకుండా పొత్తు ఉంటుందని పవన్ స్పష్టం చేయడంతో ఎల్లో మీడియాకు హుషారు వచ్చింది. పవన్ ఇంటర్వ్యూలను పతాక శీర్షికకు ఎక్కించారు. అటు టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయ్యింది. పవన్ భజన ప్రారంభమైంది.

పవన్ ఎంత దూకుడు అయినా సీనియర్ నాయకుల విషయంలో చాలా గౌరవంగా ఉంటారు. హుందాగా వ్యవహరిస్తారు. అందుకే టీడీపీలో సీనియర్లు ఈసారి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. తమ సీటంటే పవన్ సైతం జనసేన కోసం పెద్దగా పట్టుబట్టరని నమ్మకంగా ఉన్నారు. పైగా జనసేనతో పొత్తు ఉంటే గెలుపు నల్లేరు మీద నడక అని తెలుసు కాబట్టి ఈసారి వారసులు కాకుండా తామే బరిలో దిగాలని చూస్తున్నారు. పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. పవనే తమను గెలిపిస్తారని కొండంత నమ్మకం పెట్టుకున్నారు.